
సర్కారు పునాదులు కదులుతున్నాయి
కోదండరాం ప్రశ్నలకు టీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి: మల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలను ఏకం చేసిన శక్తి కోదండరాం అని, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోదండరాం చేసిన ఐక్య ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రెండేళ్లలో టీఆర్‌ఎస్ పాలనలోని వైఫల్యాలపై ప్రజల పక్షాన కోదండరాం ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పకుండా మంత్రులంతా దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు.
టీఆర్‌ఎస్ నేతలకు తమ పాలనపై విశ్వాసం ఉంటే కోదండరాం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేతకాకుంటే కోదండరాంకు క్షమాపలను చెప్పాలని డిమాండ్ చేశారు. కోదండరాం మాట్లాడే ప్రతీ మాట తెలంగాణ ప్రజల గొంతుక అని అన్నా రు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు విరుచుకుపడటం టీఆర్‌ఎస్ ప్రభుత్వ చేతకానితనానిని, అభద్రతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి
తెలంగాణ గాంధీ కోదండరాంపై టీఆర్‌ఎస్ దొంగలు విరుచుకుపడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ విమర్శించారు. అధికార పార్టీ నేతలు కోదండరాంపై విమర్శలు చేసినందుకు మంగళవారం ఆయన అమరవీరుల స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పిం చారు. కేసీఆర్‌కు చెంచాలుగా ఉన్న వారు కోదండరాంపై దాడికి దిగుతుంటే తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు.
రైతుల పక్షాన మాట్లాడితే తప్పా?
రైతుల పక్షాన మాట్లాడటమే కోదండరాం చేసిన తప్పా అని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కోదండరాంపై దాడి అప్రజాస్వామికమన్నారు. కోదండరాం పక్షాన తెలంగాణ ప్రజానీకం ఉంటుందన్నారు.
జర్నలిస్టు నేతలతో చర్చలు
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లాలో జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవితో జర్నలిస్టు సంఘాల నేతలు మంగళవారం చర్చించారు. చర్చల అనంతరం మల్లు రవి మాట్లాడుతూ.. జర్నలిస్టులను కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.