
‘మీ వాళ్లు రూ.2వేలు లంచం తీసుకున్నారు’
దొంగతనం కేసులో రికవరీ అయిన బైక్‌ను ఇవ్వడానికి పోలీసులు రూ.2 వేలు తీసుకున్నారంటూ కమిషనరేట్ ఫీడ్‌బ్యాక్‌లో ఓ బాధితుడు వెల్లడించడంతో బంజారాహిల్స్ పోలీసులు కంగుతిన్నారు.
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా పోలీసు శాఖ ఇటీవలే కొన్ని కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ కమిషనరేట్ అధికారులు అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేస్తూ ఫిర్యాదుదారులు, బాధితులు, కేసుల్లో ఉన్నవారితో మాట్లాడుతుంటారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో లభించిన సేవలపై ఆరా తీస్తుంటారు. పోలీసుల నుంచి స్పందన ఎలా ఉందని అడుగుతుంటారు. ఈ క్రమంలో బాధితులు రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. అయితే బుధవారం ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బైక్ బాధితుడికి 'ఫీడ్ బ్యాక్' సిబ్బంది ఫోన్ చేయగా.. 'దొంగతనం కేసులో రికవరీ అయిన బైక్‌ను ఇవ్వడానికి మీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నా దగ్గర రూ.2 వేలు లంచం తీసుకున్నారు' అని నిజం వెల్లడించి కంగుతినిపించాడు.
ఇదీ అసలు కథ..
ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు ఓ దొంగ చిక్కాడు. విచారణలో అతడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడినట్లు తేలింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దొరికిన బైక్ ను తిరిగి ఇచ్చేందుకు ఫిర్యాదుదారు దగ్గర నుంచి పోలీసులు రూ.2 వేలు లంచం తీసుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడే వెల్లడించాడు. అవినీతి రహిత ఠాణాలను తీర్చిదిద్దాలని యత్నిస్తున్న సమయంలో ఈ రకమైన ఫీడ్‌బ్యాక్ అందటం పై పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది.