
మంత్రి పోచారం డ్రైవర్‌పై బౌన్సర్ల దాడి
బంజారాహిల్స్: ఫిలింనగర్ రోడ్ నెం. 1లోని ఓ ఇంటి ముందు సహచరుల కోసం ఎదురు చూస్తూ నిలబడ్డ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్ నాగరాజుపై నలుగురు బౌన్సర్లు అకారణంగా దాడి చేసి గాయపరిచారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం మధ్యాహ్నం నాగరాజు తన సహచరుల కోసం ఫిలింనగర్‌లోని ఓ ఇంటి ముందు వేచి చూస్తున్నాడు. అక్కడే ఉన్న బౌన్సర్లు ఇక్కడ ఎందుకు నిలబడ్డావని నాగరాజును ప్రశ్నించారు. నా స్నేహితుల కోసం చూస్తున్నానని రోడ్డు పక్కనే నిలబడ్డాను కదా అని అన్నాడు. దీంతో రెచ్చిపోయిన బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బౌన్సర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరు ఎవరికి సంబంధించిన వారన్నదానిపై ఆరా తీస్తున్నారు.