
బొమ్మ పిస్టల్‌తో బెదిరించి..
డబ్బు డిమాండ్ చేస్తూ బొమ్మ పిస్టల్‌తో బెదిరించి బిల్డర్‌ను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడో దుండగుడు.
హైదరాబాద్ : డబ్బు డిమాండ్ చేస్తూ బొమ్మ పిస్టల్‌తో బెదిరించి బిల్డర్‌ను కిడ్నాప్ చేసేందుకు యత్నించాడో దుండగుడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం....జూబ్లీహిల్స్ రోడ్‌నెం-10లో బంజారాహిల్స్ రోడ్‌నెం-12కు చెందిన బిల్డర్ మనీష్ అగర్వాల్ ఇల్లు నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం నిర్మాణ పనులు పర్యవేక్షిస్తుండగా ముసుగు ధరించి వచ్చిన ఓ దుండగుడు ఆయనకు పిస్టల్ ఎక్కుపెట్టి డబ్బు డిమాండ్ చేస్తూ తనతో రావాలని కిడ్నాప్‌కు యత్నించాడు.
ఈ దృశ్యం చూసి అక్కడే పని చేస్తున్న కార్మికులంతా పెద్దగా అరుస్తూ పరుగు పరుగున అతని వద్దకు వచ్చారు. ఒక్కసారిగా 30 మంది వర్కర్లు పరిగెత్తుకు రావడంతో దుండగుడు మెయిన్ రోడ్డు వైపు పరుగులు తీశాడు. డైమండ్ హౌస్ వద్ద ఆటో ఎక్కి పరారవుతున్న క్రమంలో పిస్టల్ కిందపడి రెండు ముక్కలైంది.
బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. దుండగుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. బిల్డర్ వద్ద రూ.25 లక్షల వరకు డిమాండ్ చేసేందుకు నిందితుడు వచ్చాడని ఇవ్వకపోతే కిడ్నాప్ చేయడమే లక్ష్యంగా పథకం వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బొమ్మ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.