‘మెట్రో’ కొత్త టార్గెట్.. డిసెంబర్ 2018 | metro project to set new Target till December 2018 | Sakshi
Sakshi News home page

‘మెట్రో’ కొత్త టార్గెట్.. డిసెంబర్ 2018

Published Thu, May 5 2016 2:31 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

‘మెట్రో’ కొత్త టార్గెట్.. డిసెంబర్ 2018 - Sakshi

‘మెట్రో’ కొత్త టార్గెట్.. డిసెంబర్ 2018

అప్పటికి మూడు కారిడార్లలో 72 కి.మీ రూట్లో ప్రాజెక్టును పూర్తిచేస్తాం
జూన్‌లో ‘మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్’, ‘నాగోల్-మెట్టుగూడ’ ప్రారంభం లేదు
మెట్రో తొలి దశ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వమే ప్రకటిస్తుంది
ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ స్పష్టీకరణ
ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ఎండీగా గాడ్గిల్ స్థానంలో శివానంద నింబార్గీ నియామకం

 
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును 2018 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ ప్రాజెక్టు చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ వెల్లడించారు. నాగోలు-రహేజా ఐటీ పార్క్, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా.. ఈ మూడు రూట్లలో మొత్తం 72 కి.మీ. మేర ప్రాజెక్టును అప్పటికి పూర్తిచేయాలని తాజాగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పారు. గతంలో 2017 జూలై నాటికి పనులు పూర్తిచేస్తామని అనుకున్నా.. పనులు చేపట్టేందుకు అవసరమైన ఆస్తుల సేకరణ, రైట్ ఆఫ్ వే లభించకపోవడం, అలైన్‌మెంట్‌లో మార్పులు వంటిసమస్యలతో నిర్మాణం ఆలస్యమైందన్నారు. తాజాగా గడువు పొడిగింపు, ఆలస్యం కారణంగా పెరుగుతోన్న అంచనా వ్యయం చెల్లింపు, నిర్మాణ ఒప్పందంలో మార్పులు చేర్పుల వంటి అంశాలపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని చెప్పారు.
 
 బుధవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డెరైక్టర్‌గా వీబీ గాడ్గిల్ స్థానంలో శివానంద నింబార్గీ నియామకాన్ని సుబ్రమణ్యన్ లాంఛనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా వారిద్దరితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న.. నాగోలు-మెట్టుగూడ(8 కి.మీ.), మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్(11 కి.మీ.) రూట్లలో మెట్రో రైలు ప్రారంభోత్సవం ఉండదని స్పష్టం చేశారు.
 
 ఈ రూట్లలో సాంకేతికంగా పనులు పూర్తయినప్పటికీ ప్రయాణికులకు అవసరమైన భద్రతాపరమైన ఏర్పాట్ల పూర్తి, వసతుల కల్పన, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ, టికెట్ వెండింగ్ యంత్రాల ఏర్పాటు, ఇతర నిర్వహణ పనులను పూర్తి చేసేందుకు మరింత సమయం పడుతుందని చెప్పారు. మెట్రో తొలి దశ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. పాతనగరంలో మెట్రో అలైన్‌మెంట్ ఖరారుపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, సర్కారు నిర్ణయం మేరకే పనులు చేపడతామన్నారు.

ప్రస్తుతం ఎంజీబీఎస్-ఫలక్‌నుమా రూట్లో 5.3 కి.మీ మార్గం మినహా ఇతర రూట్లలో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పంజాగుట్ట, హైటెక్‌సిటీ, మూసారాంబాగ్ ప్రాంతాల్లో మెట్రో మాల్స్ నిర్మాణాలు ఊపందుకున్నాయన్నారు. కాగా, మెట్రో ప్రాజెక్టును గడువులోపల(2017 జూలై) పూర్తిచేయని కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్ల మేర పెరగనుందని ఎల్‌అండ్‌టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ సంస్థకు చెల్లించాలని ఎల్‌అండ్‌టీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసినట్లు తెలిసింది.
 
 కీలక సమయంలో వెళుతున్నా.. బాధగా ఉంది: గాడ్గిల్
 ‘‘మెట్రో నిర్మాణ ఒప్పందం కుదిరినప్పుడు 2010 సెప్టెంబర్‌లో ఎండీగా బాధ్యతలు స్వీకరించాను. ప్రస్తుతం ప్రాజెక్టు కీలక దశలో ఉంది. ఈ సమయంలో పదవీ విరమణ చేస్తుండడం బాధగా ఉంది. ఈ నెలాఖరు వరకు పదవిలో కొనసాగుతాను. మెట్రో నిర్మాణంలో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు, వాటిని అధిగమించిన తీరుపై ఓ పుస్తకం రాస్తా. ఇది భవిష్యత్ మెట్రో ప్రాజెక్టులకు గైడ్‌గా ఉపకరిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఫొటోగ్రఫీ, ట్రెక్కింగ్ వంటి హాబీలతో సేదదీరుతాను.’’
 
 ప్రాజెక్టు పూర్తిచేయడమే లక్ష్యం: శివానంద నింబార్గీ
 ‘‘జూన్‌లో ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తాను. ఇది నాకు గొప్ప అవకాశం. గడువులోగా పనులు పూర్తిచేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టును ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత గాడ్గిల్‌దే. హైదరాబాదీలకు అంతర్జాతీయ ప్రమాణాలున్న మెట్రో సేవలు త్వరలోనే అందుతాయని భావిస్తున్నాను.’’
 
 మెట్రో పనుల పురోగతి ఇదీ..
 మొత్తం 72 కి.మీ మార్గంలో పనులకుగానూ 49 కి.మీ మార్గంలో పిల్లర్ల ఏర్పాటు, వాటిపై వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. మొత్తం 57 మెట్రో రైళ్లకుగానూ 40 మెట్రో రైళ్లు ఉప్పల్, మియాపూర్ డిపోకు చేరుకున్నాయి. అలైన్‌మెంట్‌పై సందిగ్ధత కారణంగా ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో పనులు నిలిచాయి. పలు స్టేషన్లకు చేరుకునే మార్గాలను రీడిజైన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement