ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైల్ త్వరలో పరుగుపెట్టనున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రోరైల్ త్వరలో పరుగుపెట్టనున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మెట్రోరైల్ భద్రతపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రైల్వే స్టేషన్లలో తీసుకోవాల్సిన నేర, ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణలపై చర్చించారు. ప్రతి 22 రైల్వే స్టేషన్లకు ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా ప్రతిపాదనలు రూపొం దించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మెట్రో స్టేషన్లలో షిప్టుల వారీగా 24 గంటల భద్రతా ఏర్పాటు చేయాలన్నారు. మొత్తంగా ఇద్దరు డీసీపీలు, ఇద్దరు ఏసీపీలతో సహా అన్ని స్థాయిల సిబ్బందీ కలిపి మొత్తం 1,525 మంది పోలీసులు భద్రతలో నిమగ్నమవుతారన్నారు. అయితే ఇందుకు సుమారు రూ.54 కోట్ల వ్యయమవుతుందని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.