ఉగాది నాటికి ‘మెట్రో’
మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి
శామీర్‌పేట: వచ్చే ఉగాది నాటికి నగరంలో మెట్రోరైలును అందుబాటులోకి తెస్తామని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బిట్స్ పిలానీలో జరుగుతున్న ‘అట్మాస్- 2014’ టెక్నో మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఏ నగరంలోనూ రూపొందించని విధంగా ఈ ప్రాజెక్టు కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు నూతన ఒరవడితో ముందుకు సాగాలన్నారు.
మెట్రోరైలు ప్రాజెక్టుకు 80 వేల యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, అందులో 35శాతం వృథా అవుతుందన్నారు. ఆధునిక పద్ధతుల్లో విద్యుత్‌ను ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ నిర్మాణాలను రోడ్లపై నిర్మిస్తే కిలో మీటరుకు రూ. 250 కోట్లు ఖర్చు అవుతుందని, భూగర్భంలో నిర్మిస్తే కిలోమీటర్‌కు రూ. 600 కోట్లు అవుతుందని తెలిపారు. బిట్స్ వరకు మెట్రోరైలు నిర్మిస్తారా? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమి స్తూ అల్వాల్ వరకు మెట్రో రైలు విస్తరించి, అక్కడి నుంచి బస్సులను సమకూరుస్తామన్నారు.
ముగిసిన ‘అట్మాస్- 2014’
బిట్స్ పిలానీలో నాలుగు రోజు లుగా జరుగుతున్న ‘అట్మాస్- 2014’ కార్యక్రమాలు ఆదివా రం రాత్రి ముగిశాయి. దేశంలోని సుమారు 200 కళాశాలల నుంచి 1,500 మంది విద్యార్థులతో పాటు బిట్స్‌లోని 3వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.