
మధ్యాహ్న భోజన పథకం నిధులకు ఆంక్షలు!
- రూ.115.47 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లోనే..
- మూడు నెలలుగా భోజనం
- వండి పెట్టేందుకు ఏజెన్సీల ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల బిల్లుల మంజూరుపై ఆంక్షలు విధించిన ఆర్థిక శాఖ మధ్యాహ్న భోజన పథకం నిధులకు ఆంక్షలు విధించడంతో రాష్ట్రంలో ఈ పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు వండిపెట్టినందుకు చెల్లించాల్సిన బిల్లులపై ఆంక్షలు విధించడంతో మధ్యాహ్న భోజన పథకంను నిర్వర్తిస్తున్న ఏజెన్సీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూడు నెలలుగా విద్యార్థులకు భోజనం వండిపెట్టేందుకు అయిన ఖర్చులను కూడా విడుదల చేయకపోవడంతో చేసిన అప్పులు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఏజెన్సీలు వాపోతున్నాయి. గత మే నెల నుంచి కుకింగ్ చార్జీల కింద రూ. 98 కోట్లు, వండి పెట్టిన కార్మికులకు గౌరవ వేతనం కింద రూ. 17.47 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ. 115.47 కోట్లు చెల్లించాల్సి ఉందని, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలు బిల్లులు సిద్ధం చేసినా, ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వని కారణంగా వాటి చెల్లింపులు ఆగిపోయాయని విద్యాశాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
నిధులు విడుదల చేయాలి: రమాదేవి
మధ్యాహ్న భోజన పథ కంపై ఆర్థిక శాఖ విధించిన ఆంక్షలు వెంటనే తొలగించి ఈ దసరాలోపే నిధులు విడుదల చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం నాయకురాలు రమాదేవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఏజెన్సీలు మరింత ఇబ్బందులు పడతాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేస్తున్నట్లు మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.