జపాన్కు బయల్దేరిన హరీష్ రావు | minister harish rao leaves for japan tour | Sakshi
Sakshi News home page

జపాన్కు బయల్దేరిన హరీష్ రావు

Published Sun, Jul 24 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

minister harish rao leaves for japan tour

హైదరాబాద్: తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు జపాన్ పర్యటనకు పయనమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పంపులు, పరికరాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ నెల 31 వరకు జపాన్లో పర్యటించి, ఆ తర్వాత ఆస్ట్రియాకు వెళతారు. ఆగస్టు 6న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

ఆదివారం అర్ధరాత్రి హరీష్ రావు అధికారుల బృందంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో అమర్చే పంపుల మోడల్‌ విట్‌నెస్‌ టెస్ట్‌ను జపాన్‌ ఒసాకాలోని మితుబుషి హెవీ ఇండస్ట్రీస్‌ నిర్వహిస్తోంది. ఈ పంపుల విట్‌నెస్‌ పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్‌రావును, అధికారుల బృందాన్ని ఆహ్వానించింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు, సర్కిల్‌-2 ఎస్‌ఈ పి. వెంకట రాములు, సిరిసిల్ల ఈఈ ఎస్‌.ప్రభాకర్‌, టీఎస్‌ జెన్‌కో ఎస్‌ఈ కే శ్రీనివాసరెడ్డిలు మంత్రి వెంట జపాన్‌ బయలుదేరారు. జపాన్‌ పర్యటన సందర్భంగా అక్కడి సాగునీటి వనరులను వినియోగించే పద్దతులను, ప్రాజెక్టులలో వినియోగిస్తున్న అధునాతన టెక్నాలజీని మంత్రి తెలుసుకోనున్నారు.

జపాన్‌ పర్యటన ముగియగానే మంత్రి హరీష్‌ రావు ఆస్ట్రియాకు వెళతారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి పథకం 12వ ప్యాకేజీలో భాగంగా ఏర్పాటుచేయనున్న పంప్‌లకు సంబంధించి విట్‌నెస్‌ టెస్ట్‌ ఆస్ట్రియాలోని ఆండ్రిడ్జ్‌లో జరగనుంది. దీనిని పరిశీలించేందుకు మంత్రి హరీష్‌ రావు నేతృత్వంలోని అధికారుల బృందం వెళ్ళనుంది. ఆస్ట్రియా వెళ్ళే బృందంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ రావు , చీఫ్‌ ఇంజనీర్‌ హరిరామ్‌, ఎస్‌ఈ కేఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌, సిద్దిపేట ఈఈ కేఎన్‌ ఆనంద్‌, జెన్‌కో డివిజనల్‌ ఇంజనీర్‌ జే శ్రీనివాస్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement