తెలంగాణ 11 ప్రాజెక్టులకు నాబార్డు నిధులు
న్యూఢిల్లీ: నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పేవి అవాస్తవాలని టీఆర్ఎస్ పార్టీ నేత, తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ చెప్పేవి అసత్యాలు అని కొట్టిపారేశారు. వెంటనే మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నాబార్డు మధ్య ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రమంత్రి ఉమాభారతిని కలిశారు.
అలాగే కేంద్ర వ్యవసాయశాఖమంత్రిని, మరో నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ను కూడా ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అందాల్సిన సాయాన్ని గుర్తు చేయగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి 400 చెరువుల ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. తమకు మిషన్ కాకతీయ అత్యంత ప్రతిష్టాత్మకం అని అన్నారు.
ట్రిపుల్ ఆర్ కింద నిధులు విడుదల చేయాలని కోరినట్లు మంత్రి చెప్పారు. తెలంగాణలో 11 ప్రాజెక్టులకు నా బార్డు నుంచి నిధులు వస్తాయన్నారు. ఇక కందులు, పెసర వంటివాటికి మద్దతుదరతోపాటు ఇంటెన్సివ్ కూడా రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. తాము రాష్ట్రంలో నిర్మించబోయే గోడౌన్లకు గతంలో ఇచ్చినట్లే సబ్సిడీ ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెసలు, కందులు త్వరలోనే కేంద్రం కొనుగోలు చేస్తుందని చెప్పారు.