
మీరు మారరా..?
నగరంలో మౌలిక సదుపాయాలపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి
అర్ధరాత్రి పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు అధికారుల తీరుపై ఆగ్రహం
{పజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశం
రోడ్లు, బస్‌షెల్టర్లు, ఫుట్‌పాత్‌ల పరిశీలన
మరిన్ని తనిఖీలుంటాయని హెచ్చరిక
రహదారులు, బస్‌షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, మురికి కాలువలు, నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి మౌలిక అంశాలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎలా?. ఇవి పరిష్కరించలేని సమస్యలు కావు. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉంటే వీటిని అధిగమించడం కష్టం కాదు. ప్రజలకు ఉత్తమ సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనదే. ఇకపై అధికారుల తీరు మారాలి. ప్రభుత్వ పరమైన అన్ని సౌకర్యాలు ప్రజలకు సక్రమంగా అందాలి. లేకుంటే తగిన చర్యలు తప్పవు... - మంగళవారం అర్ధరాత్రి సిటీలో ఆకస్మిక తనిఖీల సందర్భంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ హెచ్చరిక -సాక్షి, సిటీబ్యూరో
సిటీబ్యూరో: నగరంలోని అధ్వాన్నపు రహదారులు, మౌలిక సదుపాయాల లేమిపై మునిసిపల్ మంత్రి కేటీ రామారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై సీరియస్ అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 11 గంటల నుంచి 2.50 గంటల వరకు ఆయన నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక విధుల నిర్వహణలో విఫలమైన జీహెచ్‌ఎంసీ అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. రహదారులతోపాటు బస్టాపులు, నీటి సరఫరా తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అర్ధరాత్రి సమయంలో పర్యటన ప్రారంభించారు. కూకట్‌పల్లి నుంచి ఉషాముళ్లపూడి రోడ్డు, కూకట్‌పల్లి నుంచి పంజగుట్ట రోడ్డు తదితర మార్గాల్లో పర్యటించారు. హంగూ ఆర్భాటం లేకుండా, మీడియాకు సైతం సమాచారం ఇవ్వకుండా ఈ తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఆకస్మిక పర్యటనతో అధికారులు ఒక్కసారిగా ఉరుకులు, పరుగులు పెట్టారు. కూకట్‌పల్లి నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన ఉషాముళ్లమూడి మార్గంలో జరుగుతున్న రోడ్డు పనుల్ని, బస్టాపుల్ని పరిశీలించారు. నిర్వహణ లోపాలపై మండిపడ్డారు. కూకట్‌పల్లి నుంచి పంజగుట్ట వైపు రోడ్లు, ఆయా సదుపాయాల తీరును పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
నెల రోజుల క్రితం ఆదేశించినా....
ఉషాముళ్లపూడి మార్గంలో పనులను పరిశీలిస్తూ వేగంగా జరగకపోవడంపై అధికారులను నిలదీశారు. తాను నెలరోజుల క్రితం వచ్చి ఆదేశించినా జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి వారం రోజుల్లోగా రోడ్డు నిర్మాణ పనుల్ని పూర్తిచేయాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. మరి కొన్ని రోజుల పాటు ఇలాగే రాత్రివేళల్లో తనిఖీలు నిర్వహిస్తానని హెచ్చరించారు. అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని, నిర్దేశించిన సమయంలోగా పనులన్నింటినీ పూర్తిచేయాలన్నారు. కేపీహెచ్‌బీ బస్టాప్ వద్ద ముంబై హైవేపై రోడ్డు పక్కన వాననీరు నిలిచిపోవడంపై మంత్రి బాగా సీరియస్ అయ్యారు. జాతీయ రహదారులు, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరితంగా తగిన ప్రణాళిక రూపొందించి నీరు నిలవకుండా , ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. అనంతరం బస్టాప్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు వీల్లేకుండా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బస్టాప్‌గల్లీలోని రోడ్డును పరిశీలించారు.
సీన్ మారేనా..?
నెల రోజుల క్రితం నగరంలోని శ్రీనగర్‌కాలనీ, ఉషాముళ్లపూడి తదితర మార్గాల్లో తనిఖీలు నిర్వహించి, వెంటనే రహదారుల మరమ్మతుల పనులు చేయాలని ఆదేశించిన మంత్రి కేటీఆర్...మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఉషాముళ్లపూడి, పంజగుట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పనుల్లో జాప్యంపై మండిపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆదేశించినా జాప్యంపై విరుచుకుపడ్డారు. అయితే వర్షాకాలంలో బీటీ రోడ్ల పనులు చేయలేకపోవడంపై అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. బాగు కావడానికి ఎంతకాలం పడుతుందని అడగ్గా, రెండు నెలలని సమాధానమివ్వడంతో అప్పటిదాకా ప్రజలు చావాలా? అని ప్రశ్నించారు. మరమ్మతులు చేసినా, వర్షానికి కొట్టుకుపోతుందని తెలిపారు. మరమ్మతులు చేసినా.. వర్షం వెలిశాక చిన్న కంకర మళ్లీ రోడ్లపై చేరి మోటర్‌బైక్‌లు కూడా స్లిప్ అవడాన్ని మంత్రి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరి పరిష్కారమెలా..అని అడిగారు ప్రజలకు ఇబ్బందుల్లేకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలన్నారు. వాస్తవానికి నగరంలో రహదారులు దెబ్బతినడానికి కారణం.. వాననీరు పోయే నాలాలు లేకపోవడమేనని ఎంతోకాలం క్రితమే గుర్తించారు. నాలాల ఆధునీకరణతోనే ఈ సమస్యలు పరిష్కారమవుతాయని గుర్తించారు. అందుకు రూ. పదివేల కోట్లు కావాల్సి ఉండటంతో , ప్రస్తుతానికి తాత్కాలిక చర్యలకు సిద్ధమవుతున్నారు. అయితే తాత్కాలిక చర్యలు సైతం వర్షాకాలంలో ఫలితమివ్వవని తెలిసిందే. దాంతో మంత్రి తనిఖీలు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేవు. ఆ సంగతలా ఉన్నప్పటికీ తన పర్యనటనలో మంత్రి పలు అంశాలను గుర్తించారు. వాటి పరిష్కారానికి ఆదేశాలూ జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
గుర్తించిన సమస్యలు..
►ప్రధాన రహదారుల్లో ఎక్కడా సైడ్‌డ్రైన్లు లేకపోవడం.
► అనేక ప్రాంతాల్లో నీరునిల్వ ఉండటం.
► కూకట్‌పల్లి బాటా షోరూమ్ వద్ద సివర్‌లైన్ నిర్వహణ లేకపోవడం. ప్రధాన రహదారికి ఏడాది కాలంగా మరమ్మతులు జరగకపోవడం.
►సర్వీసు రోడ్లు, సైడ్‌రోడ్లు అధ్వాన్నంగా ఉండటమే కాక ప్రధాన రహదారుల నంచి వచ్చే ట్రాఫిక్‌కు తగిన విధంగా లేకపోవడం.
► ఫుట్‌పాత్‌ల నిర్వహణను గాలికొదిలేశారు.
►దాంతో అనేక ప్రాంతాల్లో అక్రమంగా వ్యాపారాలు చేస్తున్నారు.
►కూకట్‌పల్లి ప్రధాన రహదారిపై చిరు వ్యాపారులు శాశ్వత నిర్మాణాలు చేసుకున్నారు.
►దీనిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదు.
ఆదేశాలు..
► రహదారుల మరమ్మతులు, వర్షాకాల సమస్యల వంటి అత్యవసర అవసరాలను ఆపదలు రాక ముం దే గుర్తించి ఇంజినీర్లు ముందస్తుగా పనులు చేయాలి.
►రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో, పాట్‌హోల్స్ ప్రాంతాల్లో కనీసం మోటార్లు వెళ్లేలా వెంటనే చర్యలు చేపట్టాలి.
►{పధాన మార్గాల్లో శాశ్వత నిర్మాణాలు రాకుండా సంబంధిత డిప్యూటీ కమిషనర్లు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి.
►చిరువ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నవారిపై నిఘావేసి పోలీసులకు తెలియజేయాలి.
► కూకట్‌పల్లి-బి సర్కిల్‌లో రచ్చబండ, రుషి కాలేజీ వద్ద వేసిన గోడను తొలగించడంతో పాటు అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.
►కేపీహెచ్‌బీలోని పురాతనకట్టడాలను కూల్చివేయాలి.
►చిన్నారి రమ్య మృతిచెందిన పంజగుట్ట వద్ద ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలి. ఈమేరకు నివేదిక అందజేయాలి.
► ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులకు స్పెషలిస్టుల సేవలు పొందాలి.
►మీడియన్ల అభివృద్ధికి, పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలి.
చిన్నారి రమ్య మృతిచెందిన ప్రదేశం పరిశీలన..
పంజగుట్టలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య మృతిచెందిన ప్రదేశాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పరిశీలించారు. అక్కడ ప్రమాదాలు జరగడానికి కారణాలేమిటని ఇంజినీర్లను అడిగారు. అక్కడి శ్మశానవాటికల వల్ల రోడ్డు బాటిల్‌నెక్‌గా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అక్కడ రహదారి వెడల్పు చేయలేమనడంతో, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అందుకుగాను జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ తదితర విభాగాలు సమన్వయంతో నెలరోజుల్లో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పలు ఏరియాల్లో జరుగుతున్న రహదారుల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంతోపాటు నిర్వహణ ను లక్ష్యంగా చేసుకొని పనులు చేయాలన్నారు. మౌలిక సదుపాయాలైన రహదారులు, బస్‌షెల్టర్లు, ఫుట్‌పాత్‌లు, సివరేజి నిర్వహణ బాగుండాలని, అధికారులంతా సమర్ధవంతంగా తమ విధుల్ని నిర్వహించాలని ఆదేశించారు. మంత్రి వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ సురేష్‌కుమార్, ఎస్‌ఈ మోహన్‌సింగ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.