రూ. 3,000 కోట్లతో సుందరీకరణ: మంత్రి కేటీఆర్
* మురుగు చేరికను నివారిస్తాం
* నాబార్డ్ ద్వారా ‘గ్రీన్ క్లైమేట్ ఫండ్’ నిధుల సేకరణకు యత్నం
* ఒకటి రెండు కిలోమీటర్లలో ప్రయోగాత్మకంగా అభివృద్ధి
* మూసీ వెంట ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై సమాలోచనలు
* 51 నాలాలపై ఎస్టీపీల సంఖ్య పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్
మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, రూ. 3,000 కోట్లతో మూసీ నదిని సుందరీకరిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. మూసీని శుద్ధిచేసిన నీటితో నింపేందుకు హైదరాబాద్‌లో ఉత్పన్నమయ్యే ప్రతి లీటర్ ద్రవ వ్యర్థాన్ని శుద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని, ఇందుకోసం పెద్దసంఖ్యలో ఎస్టీపీలు నిర్మిస్తామని పేర్కొన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా పరిరక్షించేందుకు ఇచ్చే ‘గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) నిధులను నాబార్డ్ ద్వారా సేకరిస్తామని తెలిపారు. ఆదివారం మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులతో కలసి మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మూసీ నది సుందరీకరణ కోసం నాబార్డ్ చైర్మన్ ద్వారా జీసీఎఫ్‌కు ప్రతిపాదనను పంపి నిధులు కోరతామని... అవసరమైతే దక్షిణ కొరియాకు వెళ్లి నిధుల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.
‘‘ఒకప్పుడు జీవనదిలా ఉన్న మూసీ ఇప్పుడు మురికి కాలువలా తయారైంది. హైదరాబాద్ మహా నగర పరిధిలో 30 కిలోమీటర్ల మేర మొత్తం 51 నాలాలు మూసీలోకి వ్యర్థ జలాలను తీసుకువస్తున్నాయి. నగరంలో ఉత్పత్తయ్యే వాటిలో 97 శాతం వ్యర్థ జలాలు మూసీలో కలుస్తున్నాయి. అందులో సగం వరకు మాత్రమే శుద్ధి చేస్తున్నాం. దాంతో మూసీ మురికి కూపంగా మారింది. మూసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు 51 నాలాలపై అవసరమైన చోట్ల శుద్ధి కేంద్రాలను నిర్మిస్తాం. కొత్తగా 10 చోట్ల వాటిని నిర్మించబోతున్నాం. అంబర్‌పేటలో 339 ఎంఎల్‌డీ నీటి శుద్ధి సామర్థ్యం గల కేంద్రాన్ని మరో 170 ఎంఎల్‌డీ శుద్ధి సామర్థ్యానికి విస్తరిస్తాం. స్వచ్ఛమైన నీటితో మూసీ కళకళలాడేలా తొలిదశలో ఒకటిరెండు కిలోమీటర్ల మేర అద్భుతంగా తీర్చిదిద్దుతాం...’’ అని కేటీఆర్ చెప్పారు.
ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు సంయుక్తంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేయాలని ఆదేశించామని తెలిపారు. మూసీలో అక్కడక్కడా నీళ్లు నిల్వ ఉండేలా చెక్‌డ్యాం లేదా రబ్బర్ డ్యాంలు నిర్మిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు కలసి నెలరోజుల్లో అధ్యయనాన్ని పూర్తిచేసి నివేదిక సమర్పించాలని, దాన్ని సీఎం దృష్టికి తీసుకెళదామని పేర్కొన్నారు. తొలుత ఉప్పల్ భగత్ లేఅవుట్‌కు ఆనుకుని ఉన్న 200 మీటర్ల మూసీ బఫర్ జోన్‌ను సుందరీకరిస్తామని, అక్కడున్న ప్రభుత్వ భూములను హెచ్‌ఎండీఏ ద్వారా విక్రయిస్తామని ప్రకటించారు.
ఎక్స్‌ప్రెస్ హైవే..
మూసీనది వెంట ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలన్న గొప్ప ఆలోచన సీఎం కేసీఆర్‌కు ఉందని, దేశంలోని 30 ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలతో ఈ నెల 15న నిర్వహించే సమావేశంలో ఈ ప్రాజెక్టుపై చర్చిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకు సంబంధించి 10 రోజుల్లో నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. సువాసనలు వెదజల్లే సుగంధ భరిత మొక్కలను మూసీ వెంట నాటాలని హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులకు ఆదేశించామన్నారు. మంచిరేవుల నుంచి బాపూఘాట్ వరకు స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా మూసీని తీర్చిదిద్దుతామన్నారు. హెచ్‌ఎండీఏను కొత్త తరహాలో ప్రైవేటు నిర్మాణ రంగ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. కూకట్‌పల్లి డైవర్షన్ నాలా పనులు నెల రోజుల్లో పూర్తవుతాయని, తర్వాత సాగర్ ప్రక్షాళన గురించి దృష్టిపెడతామని పేర్కొన్నారు.
మూసీకి పునరుజ్జీవం
Published Tue, Mar 8 2016 1:53 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement