మై జీహెచ్ఎంసీ యాప్ వచ్చేసింది..
హైదరాబాద్ : నగర పౌరులకు 'మై జీహెచ్ఎంసీ' యాప్ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే.తారకరామారావు ఈ యాప్ను లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా పౌరులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లవచ్చన్నారు. నగరంలో సమస్యలపై ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ రోడ్ల విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు ప్రభుత్వం నుంచి అద్భుతాలు ఆశించడం లేదని, కనీస అవసరాల కోసం చూస్తున్నారన్నారు. రోడ్ల దుస్థితిపై సీఎం నుంచి సామాన్యుడి వరకూ అసంతృప్తితో ఉన్నారన్నారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. అలాగే ఫుట్పాత్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని సమస్యలు తీర్చుతామని, అయితే కొద్ది సమయం తమకు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల పట్ల క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు.
‘మై జీహెచ్ఎంసీ’ మొబైల్ అప్లికేషన్తో రహదారుల నుంచి పన్ను చెల్లింపు వరకు అనేక రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. చెత్త డబ్బాలు, రహదారులపై గుంతలు, నిలిచిపోయిన మురికినీరు, దోమలు వంటి సమస్యలకు నగర పౌరులే చెక్ చెప్పవచ్చు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం, ఎల్ ఆర్ ఎస్(లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేసే మై జీహెచ్ఎంసీ యాప్ గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా ఖాళీ స్థలాల్లో, రహదారిపై ఎక్కడైనా చెత్త కనిపించినా ఫొటోతో ఫిర్యాదు చేయొచ్చు. జీపీఎస్, జియో ఫిన్సింగ్ సదుపాయాల ద్వారా అధికారులు ఆ ప్రదేశాన్ని గుర్తించి సమస్యను పరిష్కరిస్తారు.