
విజయసాయి విజయం వైఎస్సార్‌సీపీకి నైతిక బలం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో వేణుంబాక విజయసాయిరెడ్డి విజయం సాధించనుండటం వైఎస్సార్‌కాంగ్రెస్‌కు నైతిక బలమని, అదే సమయంలో ఈ గెలుపు సీఎం చంద్రబాబుకు నైతికంగా పరాజయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, వందలకోట్లు కుమ్మరించినా సాయిరెడ్డిని రాజ్యసభలో అడుగుపెట్టకుండా ఆపలేకపోయారన్నారు. చంద్రబాబు అపజయానికి ఇది తొలి మెట్టు అని, ఇకపై ఆయనకు రాజకీయంగా అన్నీ పరాజయాలే ఎదురవుతాయని శ్రీధర్‌రెడ్డి అన్నారు.
ఆరు నెలలుగా చంద్రబాబు రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకోసం కూడా కృషి చేయకుండా వైఎస్సార్‌సీపీని రాజ్యసభలో అడుగు పెట్టనీయరాదనే ఏకైక ఎజెండాతో, లక్ష్యంతో కృషి చేశారని, అయినా నాలుగో అభ్యర్థితో నామినేషన్ సైతం వేయించుకోలేని స్థితిలో ఉండిపోయారని అన్నారు. అధర్మం, అక్రమార్కులు తాత్కాలికంగా విజయం సాధించినా ఎప్పటికైనా ధర్మానిదే విజయమని చరిత్రలో ఎన్నోసార్లు రుజువైందని, అదే నేడూ జరిగిందని అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా కలసికట్టుగా జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గట్టిగా నిలచి.. టీడీపీ అధికార జులుంను, ప్రలోభాలను తిప్పికొట్టి ఈరోజు విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపారని, వారంతా ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తారని కోటంరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలు చాలామంది ఇపుడు పశ్చాత్తాపడుతున్నారని శ్రీధర్‌రెడ్డి చెప్పారు.