సొమ్మసిల్లిన రోజా.. నిమ్స్‌కు తరలింపు
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అస్వస్థతతో సొమ్మసిల్లి పడిపోయారు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు చెప్పినా కూడా తనను అనుమతించకపోవడంతో మండుటెండలో మౌనదీక్ష చేసిన ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9 గంటల నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం, దానికితోడు ఎండలో ఉండటంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది.
ఆమె తీవ్రంగా నీరసించారు. అయినా కూడా దీక్షాస్థలం నుంచి కదల్లేదు. తోటి మహిళా శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి రోజాను తన ఒళ్లో తల పెట్టించి పడుకోబెట్టారు. పలువురు ఎమ్మెల్యేలు ఆమెకు సంఘీభావంగా అక్కడే ఉన్నారు. చివరకు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 108 అంబులెన్సులో ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా నీరసించడంతో ఆమెకు చికిత్స అందించేందుకు నిమ్స్ ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. అంటే మూడున్నర గంటల పాటు ఆమె ఎండలోనే మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉండిపోయారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలంతా ఆమె వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ట్యాంక్‌బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించేందుకు ర్యాలీగా వెళ్లారు.