సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై చర్చించి పరిష్కరించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని కాంగ్రెస్‌పార్టీ విప్, ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలను తక్షణమే ఏర్పాటుచేయాలని కోరుతూ స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి గురువారం సీఎల్పీ రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత చట్టసభలపై ఉందని అన్నారు. భూసేకరణ చట్టం-2013కు విరుద్ధంగా, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తోందన్నారు.
దీంతో సాగునీటి ప్రాజెక్టులకోసం భూములు కోల్పోయే రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అనేక అబద్ధాలు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లోని లోపాలు, వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని పేర్కొన్నారు.
వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి సంబంధించిన ప్రాజెక్టుల టెండర్లు, కాంట్రాక్టులపై సమగ్రంగా చర్చించడానికి, అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షాన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెంటనే వర్షాకాల సమావేశాలను ఏర్పాటుచేయాలని సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు మొదట స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాంను కలసి సీఎల్పీ పక్షాన లేఖ ఇచ్చారు.
‘పవర్‌పాయింట్’కు అవకాశం ఇవ్వండి
Published Fri, Jul 15 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement