అవినీతి వ్యవహారాల్ని పక్కదారి పట్టిస్తున్నారు
చంద్రబాబు సర్కార్ తీరుపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ పెద్దల అవినీతిని తమ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతిసారీ చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారాలను పక్కదారి పట్టిస్తూ, ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేస్తూ అడ్డూ అపూలేకుండా అధికారపార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రభుత్వంలోని అవినీతి విషయాలను బయటపెట్టినప్పుడల్లా.. ప్రతిపక్షాలు అలానే మాట్లాడతాయనో, లేదంటే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయనో చెబుతూ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం అధికార పార్టీ పెద్దలకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు విషయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు చేశారని, దానిపై సీబీఐ విచారణ జరిపించిన ఉదంతాలున్నాయన్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ పత్రిక ద్వారా అవినీతి వెలుగులోకి వచ్చినా విచారణ జరిపించారని.. ఇప్పుడు కొన్ని పత్రికల తనకు మద్దతు ఇస్తున్నాయన్న భావనతో సీఎం చంద్రబాబు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
విచారణ జరిపించండి...
హంద్రీ-నీవా ప్రాజెక్టు పనుల్లో 20 (బి) ప్యాకేజీ పనులకు సింగిల్ టెండర్ మాత్రమే దాఖలై నా నిబంధనలకు వ్యతిరేకంగా అధికార పార్టీ పెద్దలకు అనుకూలంగా ఉండే వారికి రూ.కోట్లను దోచి పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి.. అందులో అవినీతి లేకుండా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. సీబీఐ విచారణతో అభివృద్ధి ఆగిపోతుందన్నదే ప్రభుత్వ ఆలోచన అయితే కనీసం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండే సీబీసీఐడీతోనైనా లేదంటే విజిలెన్స్‌తోనైనా విచారణ జరిపించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.