కంటేనే అమ్మ అని అంటే ఎలా... | Mother's Day special | Sakshi
Sakshi News home page

కంటేనే అమ్మ అని అంటే ఎలా...

Published Sun, May 8 2016 9:14 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

కంటేనే అమ్మ అని అంటే ఎలా... - Sakshi

కంటేనే అమ్మ అని అంటే ఎలా...

వీణావాణిలను కంటికి రెప్పలా
కాపాడుతున్న నిలోఫర్ ఆయాలు
తల్లిదండ్రులను మైమరిపిస్తున్నారన్న అవిభక్త కవలలు

 
 ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా...’ ఓ సినీ కవిరాసినట్లు నవమాసాలు మోసి కనకపోయినా తల్లి ప్రేమను, ప్రేమానురాగాలను పంచవచ్చని నిరూపించారీ ఆయమ్మలు. విధి వెక్కిరించిన పిల్లలకు ‘విధుల’రీత్యా ఆయాలైనా కాలక్రమంలో.. అమ్మలుగా మారారు అవిభక్త వీణా-వాణిలకు సేవలు చేస్తున్న అయమ్మలు. ఆ పిల్లలు సైతం ‘అమ్మను మించిన అమ్మలు మా ఆయమ్మలు..’ అంటూ చెబుతున్నారు. మాతృదినోత్సవం సందర్భంగా వీణావాణి- నిలోఫర్ ఆయమ్మల అనుబంధంపై ప్రత్యేక కథనం... -సాక్షి, సిటీబ్యూరో
 
 
అడగందే అమ్మయినా పెట్టదంటారు. కాని ఆ చిన్నారులకు ఆకలిని వారికంటే ముందుగానే పసిగడుతున్నారీ ఆయాలు. కడుపు నింపుతూనే  24 గంటలూ కంటికి రెప్పలా కాపాలా కాస్తున్నారు. అమ్మలోని ఆప్యాయతను, నాన్నలోని మమకారాన్ని రుచిచూపిస్తున్నారు.

 ఆసుపత్రే అమ్మ ఒడి...
 వ్యయప్రయాసలకు తట్టుకోలే ని నిరుపేద తల్లిదండ్రుల కారణంగా పదేళ్ల నుంచి నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రికే పరిమితమయ్యారు అవిభక్త కవలలు వీణావాణి(13). మీడియా కవరేజీ కారణంగా ఈ చిన్నారుల గురించి  తెలుగు రాష్ట్రాల్లోనే తెలియని వారుండరు. దాదాపు దశాబ్ధానికి పైగా...వీరు ఆసుపత్రిలోనే పెరిగి పెద్దయినప్పటికీ... చురుకుతనంలో గాని, తెలివితేటల్లో  గాని ఓ మంచి వాతావరణం ఉన్న ఇంట్లో పెరిగిన పిల్లలకు తీసిపోరు. అత్యంత క్లిష్టమైన వీరి జోడు జీవితం...ఇంత చక్కగా సాగడానికి కారణం... ఆ పిల్లలను సాకే ఆయమ్మలే.

 ఆయమ్మలే మాకు అన్నీ....
 ‘ఊహ తెలిసే వరకు కన్నతల్లి ఎలా ఉంటుందో మాకు తెలీదు. కానీ ఇప్పుడు పుస్తకాలు చదువుతున్నాం కదా! తల్లి గొప్పతనం గురించి, తల్లి ప్రేమ గురించి తెలుసుకున్నాం. జన్మనిచ్చిన అమ్మ మాకు కావాలి. కానీ ఆమె వద్దకు మేము వెళ్తే అక్కడ  ఉండలేం. ఆమే ఇక్కడకు రావాలని కోరుకుంటున్నాం’ అని వీణా-వాణి అంటున్నారు. అమ్మను మైమరిపించేలా ఇక్కడి ఆయమ్మలు మాకు సేవలందింస్తున్నారని చెప్పుకొచ్చారు.

 అంతా టైం ప్రకారం...
 ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకల్లా నిద్రలేవడం, కాలకృత్యాల అనంతరం వ్యాయామం, ఆ తర్వాత స్నానం, డ్రెస్ చేసుకోవడం, పాలు తాగడం, టిఫిన్ తినడం.. అయిపోయాక సరిగ్గా తొమ్మిది గంటలకు ట్యూషన్‌కు రెడీ. మధ్యలో మధ్యాహ్నం భోజనం గురించి కాసేపు గ్యాప్, అక్కడి నుంచి 4 గంటల దాకా చదువే. అనంతరం కాసేపు ఆటలు, పాటలు, టీవీ చూడడం, ఠంచనుగా 9 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించడం...ఈ క్రమం గత కొన్నేళ్లుగా తు.చ తప్పకుండా సాగిపోతోంది. ప్రతి ఇంట్లో చిన్నారుల రోజువారీ కార్యక్రమాలు కూడా ఇవే. అయితే ఇక్కడ... వీరు రెండు తలలు అతుక్కుని పుట్టిన అవిభక్త కవలలు కావడమే వీరికి చేసే సేవల్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. కనకపోయినా కంటిపాపల్లా వీరిని సాకడం ద్వారా వీరికి తమ కష్టాన్ని మరిచిపోయేలా చేస్తున్నారు వీరి బాగోగులు చూసే ఐదుగురు ఆయమ్మలు.

 ఇంటి దగ్గర వండి మరీ...
 ‘‘వీళ్లు ఒక రకంగా మా స్వంత పిల్లల కంటే కూడా ఎక్కువ. వారి స్వచ్ఛమైన మాటలు, ఆట పాటలు చూస్తుంటే మమ్మల్ని మేం మరిచిపోతాం’’అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఆయమ్మలు. ‘ఇంటి దగ్గర పండుగల వంటి సందర్భాల్లో ఏమైనా స్పెషల్స్ వండితే మా బిడ్డల కోసం తీసుకురాకుండా ఉండం. ఒక్కోసారి వీరికోసమే ప్రత్యేకంగా కూడా వండి తెస్తాం. అలాగే మొన్న చికెన్ వండి తెచ్చా’’ అంటూ మురిపింగా చెప్పారు భారతి అనే ఆయమ్మ. ‘పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. మీకు తెలుసా? వీరు టీవీలో కూడా డిస్కవరీ, పోగో వంటి చానెల్స్ మాత్రమే చూస్తారు. న్యూస్ కూడా బాగా గుర్తు పెట్టుకుంటారు.

అన్ని విషయాలనూ మాతో పంచుకుంటారు’’ అంటూ ఆయమ్మలు వీణా-వాణిల గురించి చెప్పేటప్పుడు పిల్లల విజయం పట్ల తల్లిలో కనపడే ఉత్సాహం  వారిలో కన్పించింది. వీరికి విద్యాబుద్ధులు చెప్పే టీచర్ అనూష కూడా ఇదే విధంగా స్పందించారు. పొద్దున్నే న్యూస్ చూసి తాను వచ్చేటప్పటికి డౌట్స్‌తో సిద్ధంగా ఉంటారని, వాణి ఫాస్ట్‌గా మాట్లేడేస్తుందని, వీణ మాత్రం ఆచి తూచి మాట్లాడుతుందని... సాయంత్రం దాకా వీరితో గడిపి ఇంటికె ళ్లినా వీరి మాటలు మరపునకు రావని అంటారా టీచర్.

 ‘‘అమ్మ అంటే రోజంతా మనతోనే ఉంటుంది. అమ్మంటే ఎప్పుడూ పిల్లల గురించే ఆలోచిస్తుంది అమ్మ అంటే మనకు ఏదైనా సమస్య వస్తే సొల్యూషన్. ’’... ఇది వీణా-వాణిలు చెప్పే నిర్వచనం. అందుకే ఈ ఆయాలు వీరికి దేవుడిచ్చిన అమ్మలయ్యారు.
 
 
 సీఎం కేసీఆర్‌ను చూడాలని ఉంది: వీణావాణి
 మాకు సీఎం కేసీఆర్ తాతంటే ఎంతో ఇష్టం. ఆయన్ను చూడాలని ఉంది.  మా ఈ చిరకాల కోరికను తీర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. టీచర్ (అనుష) వస్తుంది. ప్రస్తుతం  ఐదో తరగతి చదువుతున్న తెలుగు, ఇంగ్లీషు, హిందీ, గణితం, సైన్స్, సోషల్ ఇలా అన్ని సబ్జెక్టులు చదువుతున్నాం. బోరు కొడితే టీవీ చూస్తాం. సరదాగా ఇద్దరం కలిసి డ్యాన్స్ కూడా చేస్తాం’ అని వీణావాణి ముక్తకంఠంతో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement