మనూ స్నాతకోత్సవంలో విద్యార్థులకు నో ఎంట్రీ
విద్యార్థి సంఘం నిరసన.. స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: స్నాతకోత్సవం వేళ హైదరాబాద్‌లోని మౌలానా ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) వివాదానికి వేదికగా మారింది. సోమవారం ప్రతిష్టాత్మకంగా జరగనున్న స్నాతకోత్సవానికి తమ విద్యార్థులకే ప్రవేశాన్ని నిరాకరించింది వర్సిటీ యాజమాన్యం. ఇదేమని ప్రశ్నించిన విద్యార్థులకు... సభా ప్రాంగణం సరిపోదని, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ వంటి ప్రముఖులు వస్తున్నందున భద్రతా కారణాలను సాకుగా చెబుతోంది. అతిథులతో పాటు వర్సిటీ పట్టభద్రులు, అవార్డు గ్రహీతలు, సిబ్బందిని మాత్రమే కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్ణయించింది.
దీనిపై వర్సిటీ విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 15 వందల మంది సామర్థ్యం ఉన్న సభా ప్రాంగణంలో కొందరికే ప్రవేశం కల్పించడంపై అభ్యంతరం తెలుపుతున్నాయి. పట్టభద్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు, మిత్రులకు కూడా ఎంట్రీ పాస్‌లు ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. వెనుకబడిన రాష్ట్రం నుంచి వచ్చిన ఓ గోల్డ్ మెడలిస్టు... స్నాతకోత్సవానికి తన తల్లిదండ్రులను పిలిచాడు. అయితే వర్సిటీ వారిని అనుమతించకపోవడంతో నిరాశతో వారు ఇంటిముఖం పట్టారని, కుటుంబ సభ్యుల సమక్షంలో పతకం తీసుకోవాలన్న తన చిరకాల కోరిక నేరవేరడంలేదని సదరు విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇది అవమానకరం...
వర్సిటీ క్యాంపస్‌లో స్నాతకోత్సవం నిర్వహించడం ఇదే తొలిసారి. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో విద్యార్థులకు అనుమతి లేకపోవడాన్ని వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది తమకు అవమనకరమని, దీనికి నిరసనగా స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు మనూ విద్యార్థి సంఘం ప్రకటించింది. డిగ్రీలు, పతకాలు అందుకుంటున్నవారిని అభినందిస్తూనే... వర్సిటీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. యాజమాన్యం వీఐపీ కల్చర్‌ను పెంచి పోషిస్తోందని సంఘం అధ్యక్షుడు తాజాముల్, కార్యదర్శి అమర్ అజామ్ ఆరోపించారు. వర్సిటీ యాజమాన్యం చెబుతున్న భద్రత కారణాలతో పాటు సభా ప్రాంగణం సరిపోదన్న వాదనలను కొట్టిపారేశారు. దీనిపై వీసీకి లేఖ రాసినా స్పందించలేదన్నారు. విద్యార్థుల పట్ల యాజమాన్యం వ్యవహరిస్తున్న నిరంకుశ వైఖరికి ఇది నిదర్శనమన్నారు.