కేంద్ర సామాజిక న్యాయ శాఖ, వివిధ రాష్ట్రాల కితాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా దళితులకు మూడెకరాల వ్యవసాయభూమి పంపిణీ, భూమి అభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాల్లో భాగంగా గరిష్టంగా రూ. 10 లక్షల వరకు (రూ.5 లక్షలు మించకుండా-60 శాతం సబ్సిడీ) రుణాలిచ్చేలా నూతన రాయితీ విధానాన్ని అమలు చేయడాన్ని స్వాగతించాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీల అభ్యున్నతికి వినూత్నంగా పథకాలు, కార్యక్రమాలను చేపడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు అభినందించాయి. బుధవారం ఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ.. అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు, ఎస్సీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షను నిర్వహించింది. ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ కేసుల విచారణ, పీఏవో, పీవోసీఆర్ చట్టాల అమలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార, దాడుల బాధితులకు నష్టపరిహార చెల్లింపుపై ఈ సమావేశంలో సమీక్ష చేశారు.
కేంద్రమంత్రి తవార్‌చంద్ గెహ్లాట్ అధ్యక్షత వహించగా.. సహాయ మంత్రులు విజయ్‌సంప్లా, కిషన్‌పాల్ గుర్జార్, ఈ శాఖ కార్యదర్శి అనిత అగ్నిహోత్రి, అరుణ్‌కుమార్, అయేంద్రి అనురాగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డెరైక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి వైస్‌చైర్మన్, ఎండీ ఎం.వి.రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రం నుంచి ఎస్సీశాఖను నిర్వహించే మంత్రి, ఈ శాఖ ఉన్నతాధికారులు హాజరై ఉంటే బావుండేదని ఈ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. తెలంగాణలో అమలు చేస్తున్న ఆయా సంక్షేమ పథకాలు, భూపంపిణీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, కల్యాణలక్ష్మి, ప్రీ, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, నష్టపరిహారాల చెల్లింపు తదితరాల గురించి ఆయన సోదాహరణంగా వివరించారు.
రాష్ర్టంలో సంక్షేమ పథకాల అమలు భేష్
Published Thu, Feb 18 2016 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM
Advertisement
Advertisement