వర్గీకరణ జరిగితే ఊరికో లింకన్: మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ జరిగితే చర్మకారుల కుటుంబాల నుంచి ఊరికో అబ్రహం లింకన్ పుట్టుకొస్తారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శుక్రవారం 18 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. పాదరక్షలు తరతరాలుగా మాదిగలకు, ఉప కులాలకు జీవనోపాధిగా మారాయని చెప్పారు. చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు అయ్యారన్నారు.
అవకాశం వస్తే చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టిస్తాయని, అవకాశాలు దోపిడీకి గురైన చోట అణిచివేతే తప్ప అభివృద్ధి ఉండదని వ్యాఖ్యానించారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దళిత్ స్టూడెంట్ యూనియన్ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఒక రోజు దీక్ష చేపట్టింది.