
ఇక ‘గ్రేటర్’ బస్సులు
ముంబయి తరహాలో అమలు
అందుకే జీహెచ్‌ఎంసీ నిధుల కేటాయింపుచురుగ్గా సన్నాహాలు
ఆర్టీసీ నష్టాలకు చెక్
ఇకపై ఆర్టీసీ బస్సులను జీహెచ్‌ఎంసీ నడపనుందా? ముంబయి స్ఫూర్తితో ఈ దిశగా ముందుకు వెళుతోందా? ప్రస్తుతం ఇదే విషయమై నగరంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆర్టీసీ నష్టాల్లో ఉండడం... జీహెచ్‌ఎంసీ నుంచి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
సిటీబ్యూరో: ముంబయి, అహ్మదాబాద్, నాగపూర్ నగర కార్పొరేషన్ల తరహాలో రాబోయే రోజుల్లో సిటీ బస్సుల బాధ్యతలను జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఇప్పటికే వివిధ పౌరసేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీ... ప్రజల నిత్యావసరమైన రవాణా సేవలకూ ముందుకొస్తోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో... నగరంలో నడిచే బస్సులకు సబ్సిడీగా జీహెచ్‌ఎంసీ నుంచి రూ. 200 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణలో ఈ రూ.200 కోట్లు ప్రముఖ పాత్ర పోషించాయి. ‘ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఎందుకి స్తోంది?...’ అంటే త్వరలోనే నగరంలో నడిచే సిటీ బస్సులు కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. నగరంలో ఆర్ అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్ల నిర్వహణ బాధ్యతలు ఇటీవలే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బస్సుల నిర్వహణను కూడా ప్రభుత్వం జీహెచ్‌ంఎసీకి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దేశంలో అహ్మదాబాద్, నాగపూర్, ముంబై వంటి నగరాల్లో స్థానిక సంస్థలు బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అహ్మదాబాద్ మున్సిపల్‌ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (ఏఎంటీఎస్) దాదాపు 800 బస్సులు నిర్వహిస్తోంది. నాగపూర్ మహానగర్ పరీవాహన్ లిమిటెడ్ ప్రైవేటు సంస్థతో కలిసి బస్సులు నడుపుతోంది.
జీహెచ్‌ఎంసీ కూడా ఆ నగరాల అనుభవాలను సమీక్షించి... బస్సుల నిర్వహణలో భాగస్వామి కానుంది. ఇప్పటికే మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కింగ్ కాంప్లెక్సులు, ఎఫ్‌ఓబీల ఏర్పాటు తదితర సేవల్లో పాలు పంచుకుంటున్న జీహెచ్‌ఎంసీ...తాగునీటి సరఫరా వ్యవస్థనూ తన పరిధిలోకి తీసుకురావాలనే యోచనలో ఉంది. ఆర్టీసీ నష్టాలను భరించేందుకు తన ఖజానా నుంచి నిధులు ఇస్తున్నందున గ్రేటర్ పరిధిలో సిటీ బస్సుల నిర్వహణను కూడా ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించనుంది. సదుపాయాలు మెరుగుపరచడం.. ప్రకటనల రూపేణా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం వంటి చర్యల ద్వారా నష్టాలను తగ్గించుకునే వీలుందని సంబంధిత వర్గాలు ఆశిస్తున్నాయి. బస్‌షెల్టర్ల ద్వారా జీహెచ్‌ఎంసీకి ప్రస్తుతం ఏటా దాదాపు రూ.5 కోట్ల ఆదాయం వస్తోంది. సుమారు వెయ్యి వాహనాలను నిర్వహిస్తున్న రవాణా విభాగం కూడా జీహెచ్‌ఎంసీకి ఉంది.