దళితులను కాదు నన్ను కాల్చండి: మోదీ | my salute to telangana, sasy pm narendra modi, | Sakshi
Sakshi News home page

దళితులను కాదు నన్ను కాల్చండి: మోదీ

Published Mon, Aug 8 2016 1:35 AM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM

దళితులను కాదు నన్ను కాల్చండి: మోదీ - Sakshi

దళితులను కాదు నన్ను కాల్చండి: మోదీ

► బీజేపీ మహా సమ్మేళనంలో ప్రధాని ఉద్వేగ ప్రసంగం
► కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారు
► మీరు దాడి చేయాలనుకుంటే నాపై చేయండి
► నా దళిత సోదరులపై కాదు.. ఈ ఆట బంద్ కావాలి
► సమాజాన్ని విభజించే రాజకీయాలు వదిలేయండి
► కొన్ని సంఘటనలతో సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది
► ఐక్యతే దేశాభివృద్ధికి వెన్నెముక
► దళితులు బీజేపీకి దగ్గరవుతున్నారని విపక్షాలకు భయం పట్టుకుంది
► మూడు విప్లవాల కోసం యాత్ర చేపట్టాలని కార్యకర్తలకు పిలుపు
► పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు కనిపిస్తోందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్ : ‘‘దళితులపై గుత్తాధిపత్యం తమకే ఉందని కొందరు భ్రమపడుతున్నారు. దళితులను పీడించి సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీకేమైనా సమస్య ఉంటే.. దాడి చేయాలనుంటే నాపై దాడి చేయండి.. నాపై తూటాలు కాల్చండి. కానీ నా దళిత సోదరులపై కాదు. ఈ ఆట బంద్ కావాలి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. శాంతి, ఐక్యత, సద్భావన అనే మూలమంత్రాన్ని ఎన్నడూ విస్మరించలేమని, దేశాభివృద్ధికి ఐక్యతే వెన్నెముక అని పేర్కొన్నారు. కొన్ని ఘటనల వల్ల సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బలహీన, పీడిత వర్గాల రక్షణ, వారిని గౌరవించడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. మనిషి, మనిషికి మధ్య అంతరం సరికాదని, అందరూ ఐక్యతతో ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం రాష్ట్ర పర్యటనలో భాగంగా సాయంత్రం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనంలో ప్రధాని మాట్లాడారు. ‘తెలంగాణ సోదర సోదరీమణులారా.. కార్యర్తలు అందరికీ నమస్కారం...తెలంగాణకు నా వందనాలు’ అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. అనంతరం ఆయన హిందీలో ప్రసంగించారు. ప్రసంగం
ఆయన మాటల్లోనే..

 దళితులను పీడించే హక్కు ఎవరిచ్చారు?
 వేల ఏళ్లుగా మన సమాజంలో కొన్ని తప్పులు జరుగుతున్నాయి. అంటరానితనం చొరబడింది. రామానుజుల నుంచి మహాత్మ గాంధీ వరకు మహాపురుషులంతా చెడుపై పోరాడారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా ఈ లోపాలు ఉన్నాయని అంగీకరించాలి. మానవత్వానికే మచ్చలా ఇవి అక్కడక్కడ వికృత రూపంలో బయటపడుతున్నాయి. దళితులను పీడించే హక్కు ఎవరిచ్చారు? సమాజ ఐక్యతే మన ప్రాధాన్యం. కుల, మత, జాతి, లింగ, సంప్రదాయ భేదంతో సమాజాన్ని విభజించేందుకు ఎట్టి పరిస్థితిలో అనుమతించబోం. ఇందుకు ఏ ధర్మం సమ్మతించదు. వసుదైక కుటుంబం అని గొప్పగా మాట్లాడుకునే మనం మన దళిత సోదరులను కలుపుకోలేకపోలేమా? ఇది సామాజిక సమస్య అని నాకు తెలుసు. అది మన మెదళ్లలో చొరబడి యుగాలుగా తిష్ట వేసింది. మనం జాగృతతో ఈ సమస్య నుంచి దేశాన్ని కాపాడాలి. ఇలాంటి ప్రవృత్తులు గల వ్యక్తుల ముసుగులను తొలగించాల్సిన అవసరముంది. ఈ రాజకీయాలతో సమస్య మరింత తీవ్రమవుతోంది. సమాజాన్ని విభజించే రాజకీయాలను వదిలేయండి. దళితుల పేరుతో రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించే ప్రయత్నాలను విజయవంతం కానివ్వబోం.
 
వాళ్లకు అంబేడ్కర్‌ను గౌరవించాలనిపించలేదు
దళితులకు బీజేపీ వాస్తవాలను తెలియజేస్తే వచ్చే 50 ఏళ్ల వరకు ఆ పార్టీని అధికారం నుంచి జరపలేమన్న భయం విపక్షాలకు పట్టుకుంది. అంబేడ్కర్‌ను గౌరవించాలని గత 70 ఏళ్లలో వారికి ఎన్నడూ తోచలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రెండ్రోజులపాటు పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాం. తొలిసారి యూఎన్‌లో అంబేడ్కర్ జయంతి నిర్వహించాం. 102 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని జరిపాం. అమెరికా కాంగ్రెస్‌లో మాట్లాడే అవకాశం లభిస్తే స్వామి వివేకానంద, మహాత్మగాంధీ, అంబేడ్కర్‌ల గొప్పతనాన్ని వివరించా. అంబేడ్కర్ స్మారకార్థం పంచ తీర్థాలను ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్ ఇండియాలో భాగంగా దళితులు, గిరిజనులు, మహిళలకు ప్రతి బ్యాంకు రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల రుణాన్ని మంజూరు చేయాలని ఆదేశించాం. ఇటీవల 3 వేల మంది దళిత పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించా. దేశాన్ని మార్చే శక్తి వీరికి ఉందని గ్రహించా. దీంతో దళితులు తమకు దూరం అవుతారని విపక్షాలు భయపడుతున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల్లోనూ దళితులు ముందు వరుసలో ఉన్నారు.
 
మూడు విప్లవాల కోసం తిరంగ యాత్ర
ఈ ఆగస్టు 15తో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై పార్టీ కార్యకర్తలు మువ్వన్నెల జెండా(తిరంగా) యాత్ర చేపట్టాలి. స్వాతంత్య్రోద్యమంతో సంబంధం ఉన్న చారిత్రాత్మక ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగాలి. ఆగస్టు 7 నుంచి 15 వరకు దేశంలో తిరంగ యాత్రను నిర్వహించాలి. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రాన్ని ఇప్పించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు యాత్రను కొనసాగించాలి. జాతీయ జెండాలో ఉండే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతోపాటు ఆశోక చక్రానికి చిహ్నంగా దేశంలో కాషాయ విప్లవం, శ్వేత విప్లవం, రెండో హరిత విప్లవం రావాలి. కాషాయ విప్లవం గురించి నేను మాట్లాడితే కొందరు భయపడుతున్నారు. నా దృష్టిలో కాషాయం అంటే వెలుగు. కాషాయ విప్లవం అంటే దేశ వ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా. పాలు, పత్తి, చక్కెర అధిక ఉత్పత్తికి శ్వేత విప్లవం రావాలి. ఆధునిక సాంకేతిక తో వ్యవసాయంలో రెండో హరిత విప్లవం రావాలి. నీలి రంగు అశోక చక్రం ఆర్థిక శక్తికి చిహ్నం. సముద్రపు నీలి రంగు తరహాలోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు ప్రసరించాలి. పర్యావరణ పరిరక్షణ ముఖ్యం. ఆకాశం నలుపు రంగులో కాదు.. నీలి రంగులో ఉండాలి. ఈ సందేశంతో తిరంగ యాత్ర నిర్వహించండి. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల బలిదానాలను గుర్తు చేసుకుంటూ మాజీ సైనికులు సైతం యాత్రలో పాల్గొనాలి.
 
గతంలో నిత్యం అవినీతి వార్తలే..
గత ప్రభుత్వాల కాలంలో నిత్యం అవినీతి వార్తలే వచ్చేవి. కానీ ఇప్పుడు ఒక్క మరక లేకుండా రెండేళ్ల పాలన సాగించాం. ప్రజల సొమ్మును లూటీ చేయనీయం. గతంలో ప్రభుత్వం ఒకటి ఉంటే హైకమాండ్ మరొకటి ఉండేది. నా హైకమాండ్ మాత్రం ప్రజలే. వారి ఆశలు, ఆకాంక్షలే నాకు శిరోధార్యం.

ప్రజల సంఘటిత శక్తి అపూర్వం
దేశ సామాన్య ప్రజల సంఘటిత శక్తి అపూర్వమని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. నాడు లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు ప్రజలు అప్పట్లో దేశంలో ఆహార కొరతను తీర్చేందుకు వారంలో ఒకరోజు ఒక పూట భోజనాన్ని మానేశారు. ఈనాడు నా పిలుపుకు స్పందించి 1.25 లక్షల సంపన్న కుటుంబాలు వంట గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాయి. గ్యాస్ సబ్సిడీ వదులుకున్న వారి స్థానంలో 5 కోట్ల మంది పేద కుటుంబాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం. పేద తల్లులు కట్టెల పొయ్యిపై అన్నం వండుతున్నారు. వారి శరీరంలో 400 సిగరెట్లకు సమానమైన పొగ వెళ్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాగైతే నా పేద తల్లుల ఆరోగ్యం ఏం కావాలి? వారి పిల్లలు ఏం కావాలి? అందుకే వారందరికీ కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించాం.

తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కనిపిస్తోంది
తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు కనిపిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొత్త చరిత్ర సృష్టించడంలో హైదరాబాద్ పేరుగాంచిందని, 2013లో తాను ఇక్కడ నిర్వహించిన సభ ప్రవేశానికి టికెట్లను పెట్టడంతోనే బీజేపీ శక్తిసామర్థ్యాలు రాజకీయ పండితులకు తెలిసి వచ్చాయని అన్నారు. ‘‘ఈ రోజు ఈ సభకు హాజరైన జన సందోహాన్ని చూస్తే బీజేపీ సంఘటిత శక్తి కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్తు కనిపిస్తోంది’’ అని అన్నారు.

చేనేతకు వెలుగుల వందనం
చేనేత కండువాను మనస్ఫుర్తిగా స్వీకరిస్తున్నానన్నాని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు మహా సమ్మేళనం కార్యక్రమంలో... కార్యకర్తలందరూ చేనేత కార్మికులకు సంఘీభావంగా తమ సెల్‌ఫోన్ లైట్లను వెలిగించి ప్రదర్శించారు. ఇదే తన చేనేత దినోత్సవమని, చేనేత కార్మికులకు తానిచ్చే గౌరవమని, వారి జీవితాల్లో తీసుకొచ్చే వెలుగు అని ప్రధాని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement