రేవంత్.. ఇప్పుడు సమాధానం చెప్పాలి
ఆనాడు మంత్రి పదవులపై రాద్ధాంతం చేశావ్..
సీఎం కేసీఆర్‌పై విమర్శలా..!
హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి
చిక్కడపల్లి: వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటున్న రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయంపై సమాధానం చెప్పాలని తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గాంధీనగర్ వై జంక్షన్ వద్ద టీఆర్‌ఎస్ నాయకులు బీఎన్ శ్రీనివాస్‌రావుయాదవ్, పాశం రవి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ నోరెత్తితే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నా నగరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ. 9 లక్షలు ఖర్చు అయితే లక్షన్నర చొప్పున ఇస్తున్న బీజేపీ మేమిచ్చాం అనిచెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో గతంలో రూ. 50 లక్షల సభ్యత్వ నమోదు జరుగగా ఈ సారి ఇప్పటికే 75 లక్షల సభ్యత్వం నమోదైందన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల బీమా ఉంటుందని, ఇప్పటికి ముషీరాబాద్‌లో ముగ్గురికి ఇన్సూరెన్స్ ఇప్పించామన్నారు.కార్యక్రమంలో ముషీరాబాద్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ ముఠాఘోపాల్, గాంధీనగర్, రాంనగర్ డివిజన్ల కార్పొరేటర్లు ముఠా పద్మనరేష్, వి.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.