అబద్ధాలకు మారుపేరుగా కేసీఆర్ కుటుంబం మారిందని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలను ప్రచారం చేసుకోవడమే జన్మహక్కుగా ఆ కుటుంబం వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ పోరాటాన్ని, రాష్ర్ట సాధన కోసం జరిగిన ఆత్మహత్యలను మరుగు పరిచేందుకు హైదరాబాద్ విమోచనను అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ను బీజేపీ ముందుకు తెచ్చిందని ఎంపీ కవిత చేసిన విమర్శలపై ఆయన పై విధంగా స్పందించారు. హైదరాబాద్ స్టేట్‌లో ఎప్పుడో జరిగిన దాని గురించి బీజేపీ ఇప్పుడు మాట్లాడుతోందని, తెలంగాణపై వెంకయ్యనాయుడు, ఇతర నాయకుల కుట్రలు ఇంకా కొనసాగుతున్నాయని ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించారు. రాష్ట్ర ప్రభుత్వమే సెప్టెంబర్ 17ను నిర్వహించాలని 1998 నుంచి బీజేపీ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అప్పుడు సమైక్యపాలనలో కేసీఆర్ మంత్రిగా ఉన్నపుడు స్పందించలేదన్నారు. సీఎంగా రోశయ్య ఉన్నపుడు ఈ ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహించాలని కేసీఆర్ గట్టిగా డిమాండ్ చేశారని, కావాలంటే ఆ ఆడియో, వీడియోలను పంపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ఎంఐఎంకు తొత్తుగా మారి ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు నిరాకరిస్తోందన్నారు. ఈ విషయంలో మోసం చేసింది, మోసం చేస్తున్నది టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పిన కేసీఆర్, ఎంత మందిని గుర్తించి వారికి పరిహారాన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీంచడం కేసీఆర్ కుటుంబానికే చెల్లిందన్నారు. బీజేపీపై విమర్శలు చేసేపుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలని సూచించారు.
ఆ కుటుంబం అబద్ధాలకు మారుపేరు: నల్లు
Published Thu, Sep 8 2016 6:15 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement