‘చేనేత’ పాలసీ తీసుకొస్తాం
జాతీయ చేనేత దినోత్సవంలో కేటీఆర్
హైదరాబాద్: చేనేత కార్మికులను ప్రోత్సహించి వారికి తోడ్పాటునందిస్తామని, త్వరలోనే నూతన చేనేత పాలసీ తీసుకొస్తామని మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రవీంద్రభారతిలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో కేటీఆర్ మాట్లాడుతూ... త్వరలోనే చేనేత ప్రాంతాల్లో పర్యటిస్తామన్నారు. చిత్తశుద్ధితో చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తామని, ఈ రంగం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో తోడ్పాటు అందిస్తామని చెప్పారు. అనంతరం చేనేత లక్ష్మి పథకం క్రెడిట్, డెబిట్ కార్డుల బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ పథకానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందిస్తున్న చేయూతను అభినందించారు. చేనేత రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి కార్మికుల ఆత్మహత్యలను నివారించాలని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రాజ్ భైరి మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. హెచ్‌డీఎఫ్‌సీ హైదర్‌గూడ బ్రాంచ్ మేనేజర్ చిన్నయ్య బోధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత ఉత్పత్తులతో యువతులు చేసిన ఫ్యాషన్ షో అలరించింది.