చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు  | B S Ramulu Article On Handloom Workers In Sakshi | Sakshi
Sakshi News home page

చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు 

Published Tue, Aug 7 2018 1:54 AM | Last Updated on Tue, Aug 7 2018 1:54 AM

B S Ramulu Article On Handloom Workers In Sakshi

మిరుమిట్లు గొలుపుతూ ప్రపంచానికి వెలుగులు అందించిన చేనేత.. జౌళిమిల్లుల విస్తరణతో గుడ్డికాయ పట్టింది. మసిబారుతూ వచ్చింది. చేనేత నిపుణులే వృత్తి వదిలి బట్టల మిల్లు కార్మికులుగా వలసపోవలసి వచ్చింది. వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ ఉపాధి కల్పించిన రంగంగా చేనేత శతాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చింది. ఇదంతా గత చరిత్ర. ప్రస్తుతం చేనేత వృత్తి సామాజిక వర్గాలు ఆ వృత్తినుంచి వైదొలగి ఇతర వృత్తుల్లో చేరిపోయారు. చేనేత వృత్తి కులాల జనాభాలో ఐదు, ఆరు శాతం మాత్రమే చేనేత వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. 

చేనేత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటిది ప్రజల మనస్సుల్లో చేనేతపట్ల ఆదరణ పెరగడం. ఎంత ధర అయినా పట్టు బట్టలు, గార్మెంట్స్, రెడీమేడ్, సూటింగ్స్‌ కొంటున్నట్లుగా చేనేతను ప్రతిష్టాత్మకంగా కొనే స్థితి పెరగాలి. స్వయం పోషకంగా ఎదగడానికి ప్రభుత్వం నుండి అనేక సదుపాయాలు శాశ్వత ప్రాతిపదికగా అందించడం అవసరం. చేనేత కోసం కొన్ని రకాలను ప్రత్యేకంగా కేటాయిం చడం, దాన్ని పవర్‌లూమ్‌లు, బట్టలమిల్లులు ఉత్పత్తి చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం మరొక కార్యక్రమం. 

చాలాకాలం నుండి బట్టలపై ప్రభుత్వం రిబేటు ఇవ్వడం ద్వారా సహకరించే కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. దీని ద్వారా దొంగ లెక్కలు రాసి, ఉత్పత్తి, మార్కెట్, అమ్మకాలు లేకుండానే కాగితాలపై వాటన్నిటిని సృష్టించి భోంచేసే యంత్రాంగం పెరుగుతూ వచ్చింది. పైగా సహకార రంగంలో ఉన్న మగ్గాలు నాలుగింట ఒకటవ వంతు మాత్రమే. మిగతా మూడు వంతుల నేత కార్మికులకు ఆ సౌకర్యం కూడా అందేది కాదు. అందువల్ల ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, ప్రావిడెంట్‌ ఫండ్, జియో ట్యాగింగ్‌ వంటి వాటిని అనుసంధానించి పక్కాగా ప్రత్యక్షంగా చేనేత వృత్తివారికి లాభం కలిగించడం అవసరం.  
తిరిగి చేనేత అభివృద్ధికి కొత్త దృక్పథం అవసరమవుతున్నది. చిరిగిన బట్టలను, చింపుకుని బట్టలను వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఎంత చినిగితే అంత ఫ్యాషన్‌. అలా జీన్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అదేవిధంగా ఒక ఫ్యాషన్‌గా చేనేతను అందరికీ ఆకర్షణీయంగా మార్చినపుడే దాని మార్కెట్, ప్రాచుర్యం పెరుగుతుంది. పట్టుచీర కట్టుకోవడం ఒక సామాజిక గౌరవం. ఖాదీ బట్టలు వేసుకోవడం ఒక సామాజిక గౌరవం. అలాగే సూటు వేసుకోవడం సామాజిక గౌరవాన్ని తెలుపుతుంది. ఈ విధంగా ఆలోచించి చేనేతను ఒక ఫ్యాషన్‌గా, ఒక సామాజిక గౌరవానికి ప్రతిష్టగా మార్చే కృషి చేయడం అవసరం. 

చేనేతలో కాళ్ళతో తొక్కడంగానీ, చేతులతో షట్టర్‌ కొట్టడంగానీ ప్రతిసారీ 25 కిలోల బరువును మోయడం, నెట్టడం జరుగుతున్నది. ఎని మిది, పది గంటలు ప్రతిసారీ 25 కిలోల బరువు నెట్టడం అనే పరిశ్రమ చేనేత కార్మికులను, వారి ఆయుష్షును, ఆరోగ్యాన్ని, దేహదారుఢ్యాన్ని దెబ్బతీస్తున్నది. చీరలకు అంచులు, డిజైన్‌లు, కొంగులు ప్రత్యేకంగా రూపొందించడానికి పింజర అవసరం పడుతుంది. ఈ పింజర తిరగడానికి 25 కిలోలకు తోడుగా మరో పది కిలోల బరువు చేతులు, కాళ్ళపై పడుతున్నది. అందువల్ల ఈ బరువును కుట్టుమిషన్‌ మోటార్‌వలె హాఫ్‌ హెచ్‌పీ మోటారు బిగించి చేనేత కార్మికులకు బరువు, భారం తగ్గించడం చేయవచ్చు. 

దీనికి తోడు ప్రభుత్వం పత్తిని సేకరించి నూలు వడికించి, ఆ నూలును చేనేత కార్మికులకు అందించే ఒక సమగ్ర కార్యక్రమ రూపకల్పన కలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఆత్మహత్యలను నివారించవచ్చు.  సబ్సిడీ ఇవ్వడంలో భాగంగా గతంలో అనేక పర్యాయాలు ప్రతిపాదించిన ప్రతిపాదనను ఇప్పటికైనా ఆచరణలో తీసుకోవడం అవసరం. చేనేత రంగానికి సబ్సిడీతోపాటు చేనేత వృత్తివారికి వంద రోజుల పనికల్పనతో పని కల్పించి ఆ ఉత్పత్తులను సేకరించి ఆయా పండుగల్లో ప్రజలకు ఉచి తంగా గానీ, గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధినీ విద్యార్ధులకు అందించడం ద్వారా ఒకేసారి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇలా ప్రభుత్వం ఏటా ఇవ్వదలచుకున్న గ్రాంట్లు, సబ్సిడీలు తిరిగి చేనేత కార్మికులకే కాకుండా ప్రత్యక్షంగా ప్రజలకు కూడా దాని ప్రయోజనం అందే విధంగా పథకాలను రూపొందించడం ద్వారా జాతీయ చేనేత దినోత్సవం నిజంగానే నూతన చరిత్ర సృష్టించడానికి మార్గం వేస్తుంది.
(నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా)


బి.ఎస్‌.రాములు
వ్యాసకర్త ఛైర్మన్, తెలంగాణ బి.సి. కమిషన్‌ ‘ 83319 66987


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement