
‘శ్వాస’ అందించరూ ప్లీజ్!
మెదడులో ఫంగస్
గొంతు ద్వారానే శ్వాస
అరుదైన వ్యాధితోబాధపడుతున్న బాబు
కంటోన్మెంట్, న్యూస్‌లైన్:
ముద్దులొలికే తమ కొడుకును చూసి సంతోషించే అదృష్టం లేకుండా పోయింది ఆ బాబు తల్లిదండ్రులకు. ఎనిమిది నెలల వయసులో ఉన్న కొడుకు ముచ్చట్లను చూసి తరించాల్సిన ఆ తల్లిదండ్రులు బాబు అవస్థను చూసి తట్టుకోలేకపోతున్నారు. అందరిలా ముక్కుతో కాకుండా గొంతులో ఏర్పాటు చేసిన కృత్రిమ నాళం ద్వారా మాత్రమే శ్వాస తీసుకోగలడు. తమ కొడుకును కాపాడుకునేందుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు.
నేత కార్మికుల ఇంట కన్నీరు..
కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు చెందిన పవర్‌లూమ్ కార్మికుడు మధు, బీడీ కార్మికురాలు సుమలకు ఎనిమిది నెలల క్రితం ఓ బాబు (వర్షిత్) పుట్టాడు. ఒకమ్మాయి తర్వాత బాబు పుట్టడంతో తమ చిన్న కుటుంబం సాఫీగా సాగిపోతుందన్న సంతోషంలో ఉన్న ఆ తల్లిదండ్రులకు చిన్నారి జబ్బు గురించి తెలిసీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐదు నెలల క్రితం బాబుకు జబ్బు చేయగా స్థానిక ఆసుపత్రి వైద్యులు తమకు కేసు అర్థం కావడంలేదన్నారు. దాంతో బాబుని తల్లిదండ్రులు సికింద్రాబాద్ (విక్రమ్‌పురి)లోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకొచ్చారు. మెదడులో నీరు చేరిందని డాక్టర్లు చెప్పడంతో అందినకాడికి రూ.3లక్షలు అప్పులు తెచ్చి ఆపరేషన్ చేయించారు. మెదడు నుంచి పొత్తి కడుపు వరకు స్టంట్ వేశారు. ఇంతటితో వారి సమస్య తీరలేదు. కృత్రిమ స్టంట్ కారణంగా బాబుకు మెదడులో ఫంగస్ ఏర్పడింది. శ్వాస తీసుకోవడం కష్టసాధ్యమైంది. దీంతో గత డిసెంబర్‌లో మళ్లీ నగరానికి తీసుకొచ్చారు. వీరి దీనగాథను చూసి చలించిన రెయిన్‌బో ఆసుపత్రిలోని వైద్యుడు రమేశ్ తనవంతుగా ఉచిత చికిత్సను అందించడమే కాక, తనకు తెలిసిన వారి ద్వారా వీలైనంత వరకు ఆర్థిక సాయం చేయిస్తున్నారు.
ఆసుపత్రిలో ఉంచే స్తోమత లేకపోవడంతో సమీపంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాలుడికి చికిత్స చేయిస్తున్నారు. ప్రతి రోజూ బాబును రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రత్యేకమైన ఇంజక్షన్లు ఇప్పిస్తున్నారు. రెయిన్‌బో డాక్టర్ల దాతృత్వంతో చికిత్స ఉచితంగానే అందుతున్నప్పటికీ మందులకు పెద్ద ఎత్తున ఖర్చవుతోంది. ప్రతీరోజూ రూ.5వేల చొప్పున ఇంజక్షన్లు, మందులకు ఖర్చవుతోంది. ఇప్పటికీ కొందరు దాతలు ఇచ్చే సొమ్ముతోనే నెట్టుకొస్తున్నారు. మరో రెండు నెలల పాటు బాబుకు ఇదే చికిత్స కొనసాగిస్తే పరిస్థితి కొలిక్కి వచ్చే అవకాశముందని డాక్టర్లు పేర్కొన్నట్లు బాబు తల్లిదండ్రులు చెబుతున్నారు. బాబు వర్షిత్‌కు సాయం చేయాలనుకునే వారు సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రి వైద్యుడు రమేశ్‌ను కానీ, బాబు తల్లిదండ్రులను 9247861602, 92916 91925 నెంబర్లలో సంప్రదించవచ్చు.