
గవర్నర్ విమానాన్ని వెనక్కి రప్పించారు..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటం విమర్శలకు దారి తీస్తోంది. ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయటంలో శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించిన తీరు వివాదానికి తెరలేపింది. వివరాలు.. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయలేదని.. వెనక్కి రావాల్సిందిగా పైలట్కు సమాచారం అందటంతో మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. లగేజ్ లోడ్ అయిన అరగంట తర్వాత విమానం ఢిల్లీ బయల్దేరింది. అయితే గవర్నర్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు.