ఇరిగేషన్ దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
జీఎన్‌ఎస్‌ఎస్ 29వ ప్యాకేజీకి అంత పెంపా?
మండిపడిన జ్యోతుల నెహ్రూ
సాక్షి, హైదరాబాద్ : గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణంలో 29వ ప్యాకేజీ పనుల వ్యయం పెంపుపై తక్షణం ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైన టీడీపీ నేత సీఎం రమేష్‌కు ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. వాస్తవంగా 29వ ప్యాకేజీ తొలి అంచనా వ్యయం రూ.12 కోట్లు కాగా, ఏకంగా రూ.110 కోట్లకు పెంచడం దోపిడీ కాక మరేమిటని ప్రశ్నించారు.
ఈ ప్యాకేజీలో డిజైన్ మార్పు లేకపోయినా ఎందుకు వ్యయం పెరిగిందన్నారు. జీవో నెంబర్-22 ప్రకారం సాగునీటి ప్రాజెక్టులన్నింటి వ్యయం విషయంలోనూ ఇలాగే దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు. మొత్తం ఏపీలో 40 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.11,229 కోట్లుగా ఉంటే దానిని టీడీపీ ప్రభుత్వం ఏకంగా రూ.24,700 కోట్లకు పెంచేసిందని తెలిపారు. తెరవెనుక చినబాబు ఆదేశిస్తే తెరముందు పెద్దబాబు (చంద్రబాబు) మంత్రివర్గాన్ని అడ్డం పెట్టుకుని పెంపు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.
అందుకు అనుగుణంగా సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫైలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఈ పెంపులో వారు రూ.6,000 కోట్లు దోచుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ఈ దోపిడీ ప్రయత్నాన్ని ఇప్పటికైనా ఆపేయకపోతే వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. పట్టిసీమలాగే ఫాస్ట్‌ట్రాక్ ప్రాజెక్టులాగా గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని సంకల్పించి తామేదో కొంత వ్యయం పెంచితే దానికి తాము రాధ్దాంతం చేస్తున్నట్లు దేవినేని తేలిగ్గా చెప్పడం విడ్డూరమన్నారు. ఇనుము రేట్లు తగ్గాయని, సిమెంటు రేట్లు మాత్రమే కొద్దో గొప్పో పెరిగాయని, అంతమాత్రానికి మూడు రెట్లు వ్యయం పెంచుతారా? ఇదేమి దోపిడీ అని నెహ్రూ ప్రశ్నించారు.