దసరాకు కొత్త జిల్లాలు
రాష్ట్రంలో మొత్తం 24 నుంచి 25 జిల్లాలు: కలెక్టర్ల సదస్సులో సీఎం
4, 5 నియోజకవర్గాలు, 20 మండలాలకో జిల్లా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మొత్తం 24-25 జిల్లాలుండేలా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణానికి ఒక్కో జిల్లాకు రూ.100 కోట్ల చొప్పున కేటాయిస్తామన్నారు. దసరా పండుగనుంచి కొత్త జిల్లాలు మనుగడలోనికి రావాలన్నది తమ లక్ష్యమని ప్రకటించారు. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌లో సదస్సు ఏర్పాటు చేసి జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు చేద్దామని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. శాస్త్రీయంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలను పునర్‌వ్యవస్థీకరిస్తామని చెప్పారు. సోమవారమిక్కడ ఎంసీహెచ్‌ఆర్‌డీలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘‘తెలంగాణలో ఉన్న పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలుగా చేస్తే చాలా ఉపయోగాలున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలను ఎలా పునర్‌వ్యవస్థీకరించాలనే అంశంపై అనేక విధాలుగా ఆలోచిస్తున్నాం. రకరకాల ప్రతిపాదనలు వస్తున్నాయి. అన్నింటిపై అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఒక్కో జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాలు, సగటున 20 మండలాలు ఉంటాయి. జూన్ 2 తర్వాత హైదరాబాద్‌లో వర్క్‌షాప్ పెట్టుకుని జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తు చేద్దాం..’’ అని సీఎం అన్నారు.
రెండు నియోజకవర్గాలకో ఆర్డీవో
మండలాలను కూడా పునర్‌వ్యవస్థీకరించాలని సీఎం చెప్పారు. ‘‘మండల కేంద్రానికి దగ్గర ఉన్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలి. కొత్తగా అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలి. రెండు నియోజకవర్గాలకు ఒక ఆర్‌డీవో ఉండాలి. ఆ దిశగా రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణ జరపాలి. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలి..’’ అని సూచించారు. జిల్లాల ఏర్పాటుపై పత్రికల్లో అనేక కథనాలు వస్తున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సీఎం అన్నారు. ‘‘సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. కలెక్టర్లు కూలంకషంగా అధ్యయనం చేయాలి. ప్రతిపాదనలు తయారు చేయాలి. మ్యాపులు రూపొందించాలి.
వర్క్‌షాప్ నిర్వహించిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుందాం. పార్టీలు, నాయకుల డిమాండ్ ప్రకారం కాకుండా ప్రజల సౌలభ్యం మేరకే జిల్లాలు ఏర్పాటు కావాలి..’’ అని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలు, మండలాలు, డివిజన్లను ఏర్పాటు చేస్తున్నందున అదనంగా రెవెన్యూ అధికారులను నియమించాల్సి ఉంటుందని, అందుకు వీలుగా ఖాళీలతో పాటు కొత్త పోస్టుల ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.