కొత్త రోగాల లోకం!
గాంధీ... నిమ్స్... నీలోఫర్... ఉస్మానియా... మహానగరంలోని ప్రధాన ఆస్పత్రులివి. ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఈ ఆస్పత్రులు ఇప్పుడు కొత్త రోగాలకు కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో మురికికూపాలుగా మారుతున్నాయి. ఓ వైపు మౌలిక వసతుల కొరతతో ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులు సర్దుకోవాల్సి వస్తోంది. మరోవైపు రోగుల బంధువులూ అక్కడే సేదదీరాల్సి వస్తోంది. వ్యర్థాలు పక్కనే ఉంటాయి. దీంతో వీరంతా రోగాల బారిన పడుతున్నారు. ఎలుకలు... పందికొక్కు లు... నల్లులు... ఈ ఆస్పత్రులకు అదనపు హంగులు.
* ఉస్మానియాలో ఎలుకలు, పంది కొక్కులు, దోమలు
* నిమ్స్‌లో నల్లులు..ఈగలు... నీలోఫర్‌లో ఇన్‌ఫెక్షన్
* కంపు కొడుతున్న వార్డులు.. ప్రబలుతున్న వ్యాధులు
* ధర్మాస్పత్రుల్లో రోగులకు కొత్త కష్టాలు
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వాస్పత్రులు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాధులు నయం కావాలని వెళుతున్న వారికి కొత్త రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి.
రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో దుర్వానస వెదజల్లుతున్నాయి. పారిశుద్ధ్యానికి ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు ఆస్పత్రి వ్యర్థాల్లో కలిసి పోతున్నాయి. ఉస్మానియాలో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతుండగా... నిమ్స్‌లో నల్లులు రోగుల రక్తం పీల్చేస్తున్నాయి. నిలోఫర్‌లో ఇన్‌ఫెక్షన్‌తో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తోంది. గాంధీలో వార్డుల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరింపలేనివిధంగా ఉంటోంది.
నీలోఫర్‌లో రక్షణ ఏదీ?
నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో పారిశుద్ధ్యానికి ప్రభుత్వం నెలకు రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం నిత్యం రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి, చేతులు దులుపుకుంటున్నారు. రోగి బంధువులు పడకల చుట్టే కూర్చొని భోజనాలు చేస్తున్నారు.
ఆపరేషన్ థియేటర్ల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాక్టీరియా, ఇతర వైరస్ పిల్లలకు సులభంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి పది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి పది మంది మృతుల్లో ఒకరు ఇన్‌ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారు.
హే గాంధీ...
గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధానికి ప్రభుత్వం నెలకు రూ.23.7 లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో వార్డుల్లో పేరుకుపోతోంది. ఆస్పత్రి ఆవరణలోని క్లీనికల్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. బ్యాక్టీరియా విస్తరిస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
ఎలా శుభ్రపరచాలంటే...
ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. అవుట్‌పేషెంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్‌ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్లు శుభ్రం చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి.
నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చే యాల్సి ఉంది. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా శానిటేషన్ ఎజెన్సీలు పట్టించుకోవడం లేదు. వార్డుల్లో డస్ట్‌బిన్‌లు కనిపించడం లేదు. ఒప్పంద పత్రంలో రెండు వందల మంది సిబ్బందిని శానిటేషన్ కోసం వినియో గిస్తున్నట్లు చూపుతున్నా.. ఆస్పత్రుల్లో యాభై మందికి మించి కనిపించడం లేదు.
ఉస్మానియా వార్డుల్లో దుర్వాసన
కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట నరకకూపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.17.8 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ వార్డుల్లో చెత్త పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఆర్‌ఎంఓ ఆఫీస్, గుండె, మూత్రపిండాలు, తదితర వార్డుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది.
డ్రైనేజ్ లీక్ కావడంతో ఆస్పత్రి చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో వీటిని తాగిన రోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. సిరంజీలు, బ్లేడ్లు వంటి క్లీనిక్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు.
నిమ్స్‌లో నల్లుల బెడద
నిమ్స్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా ప్రయోజనం కానరావడం లేదు. పడకలను రోజుల తరబడి శుభ్రం చేయక పోవడంతో మంచాల్లో నల్లులు తిష్టవేస్తున్నాయి. ఇవి రోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిమ్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్పత్రిని సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని ఇటీవల పీసీబీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నట్లు తెలిసింది.