పోలీస్‌ శాఖలో కొత్త లొల్లి! | New problems in police department | Sakshi
Sakshi News home page

పోలీస్‌ శాఖలో కొత్త లొల్లి!

Published Tue, Sep 19 2017 3:57 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

పోలీస్‌ శాఖలో కొత్త లొల్లి!

పోలీస్‌ శాఖలో కొత్త లొల్లి!

- ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని ఎస్‌ఐల మొర
గతేడాదే అర్హత సాధించిన 2007 బ్యాచ్‌ ఎస్‌ఐలు
 
సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. ఆయా స్థాయిల్లోని పదోన్నతుల వ్యవహారం పీటముడిలాగా తయారైంది. అన్ని స్థాయిల్లోని పదోన్నతుల ప్రక్రియ స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇన్‌స్పెక్టర్ల నుంచి డీఎస్పీ పదోన్నతులు, డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ పదోన్నతులు, నాన్‌క్యాడర్‌ ఎస్పీ పదోన్నతులు కల్పించడానికి సీఎంవో కార్యాలయం బ్రేక్‌ వేసింది. తాజాగా ఎస్‌ఐలు పదోన్న తుల కోసం అభ్యర్థిస్తున్నారు. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 2007 డైరెక్ట్‌ రిక్రూట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు తమను ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉన్నతాధికారులకు ఎదురైంది.

కొత్త రాష్ట్రం.. ఆపై నూతన జిల్లాలు.. వీటికి తగ్గట్టు కొత్త పోస్టులు.. ‘అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అల్లుడి నోట్లోనే శని’అన్నట్టుగా ఉంది పోలీస్‌ శాఖ పరిస్థితి. సీనియారిటీ వ్యవహారంపై ఎటూ తేలకపోవడంతో డీజీపీ కార్యాలయం ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ పదోన్నతులు ఆపేసింది. ప్రస్తుతం 208 మంది ఇన్‌స్పెక్టర్లు డీఎస్పీ పదోన్నతుల కోసం వేచిచూస్తున్నారు. ఈ ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీ పదోన్నతులు కల్పిస్తేనే 2007 బ్యాచ్‌ ఎస్‌ఐలకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించేందుకు ఖాళీలు ఏర్పడుతాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అలా సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇన్‌స్పెక్టర్ల సీనియారిటీ జాబితా జీవో నంబర్‌ 54పై అన్ని రేంజ్‌ల అధికారులు సంతకాలు పెట్టడం అంత సులభంగా జరిగేటట్టు లేదు. ఇది జరగకపోతే 2007 బ్యాచ్‌ ఎస్‌ఐల పరిస్థితి కూడా వెయిటింగ్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 
 
ఇప్పటికే ఏడాది ఆలస్యం...
2007 ఎస్‌ఐ శిక్షణ కాలం ఏడాది తీసివేసినా గతేడాది ప్యానల్‌ ఇయర్‌కే ఇన్‌స్పెక్టర్‌ పదోన్నతికి అర్హత సాధించారు. ఇలా పదోన్నతి పొందాల్సిన ఎస్‌ఐలు హైదరాబాద్‌ సిటీ, వరంగల్‌ రేంజ్‌లో 200 మంది వరకు ఉంటారు. ఏడాది గడిచినా సీనియారిటీ జాబితాపై ఏం తేలకపోవడంతో ఇక తాము కూడా ఒత్తిడి పెంచాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మూడు సార్లు డీజీపీ అనురాగ్‌ శర్మకు మొరపెట్టుకున్నారు. డీఎస్పీ పదోన్నతుల ప్రక్రియ పూర్తికాగానే కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఈ భరోసా ఎప్పుడు తీరుతుందా అని వేచిచూస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement