
కార్మికుల పిల్లలకు కొత్త పథకం
♦ హోంగార్డులు, జర్నలిస్టులు, ఆటోడ్రైవర్ల ప్రమాద బీమా రూ.6లక్షలకు పెంపు
♦ మేడే ఉత్సవాల సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక దినం ‘మేడే’ రోజున రాష్ట్ర ప్రభుత్వం కార్మిక లోకానికి వరాలు ప్రకటించనుంది. కార్మికుల సామాజిక భద్రత పథకం కింద హోంగార్డులు, జర్నలిస్టులు, ఆటో డ్రైవర ్లకు అమలు చేస్తున్న రూ.5 లక్షల ప్రమాద బీమాను రూ.6 లక్షలకు పెంచనుంది. కార్మికశాఖ ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలకు మంజూరు చేస్తున్న ఉపకార వేతనాలకు బదులు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. మేడే ఉత్సవాల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో శనివారం కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్మికశాఖ కార్యదర్శి నదీం అహ్మద్‌లతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షించారు.
ఈ సమీక్షలో కార్మికుల సంక్షేమం విషయంలో ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే వివరాలను మేడే రోజున ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా అన్ని వర్గాల పేద విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందుకుంటున్నారు. అయితే ఒకే ఉపకార వేతనం తీసుకోవాలన్న నిబంధన ఉండటంతో కార్మికశాఖ అందిస్తున్న ఉపకార వేతనాలను కార్మికుల పిల్లలు అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం స్థానంలో కొత్త పథకాన్ని తీసుకొస్తే కార్మికుల పిల్లలకు లబ్ధి కలుగుతుందని సమీక్షలో సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు కొత్త పథకానికి రూపకల్పన చేయాలని కార్మికశాఖను ఆదేశించినట్లు సమాచారం.