కొత్తగా 119 బీసీ గురుకులాలు
- నియోజకవర్గానికి ఒకటి చొప్పున వచ్చే ఏడాదే ప్రారంభిస్తాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే పేరిట వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా 119 కొత్త బీసీ గురుకులాలను ప్రారంభించనున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న ఈ పాఠశాలల్లో మొత్తం 76,160 మంది విద్యార్థులు మంచి విద్యను పొందు తారని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలపై కేసీఆర్ ప్రకటన చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రమూ బలహీన వర్గాల కోసం ఇంత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యాలయాలను నెలకొల్పలేదని, తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం వెనుకబడిన కులాల విద్యార్థుల అభివృద్ధికి పునాది వేస్తుందని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీలకు 125, ఎస్టీలకు 51 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామని, మైనార్టీలకు 200 స్కూళ్లను మంజూరు చేసి గత ఏడాదే 71 పాఠశాలలు ప్రారంభించామని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేయనున్నట్టు పేర్కొన్నారు. మౌలిక వసతులు, మంచి పోషకాహారం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం తదితరాల కోసం ప్రతి విద్యార్థిపై రూ.1.05 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
ధనవంతుల పిల్లలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పొందే విద్య కన్నా మెరుగైన విద్యను ఈ స్కూళ్ల ద్వారా బీసీ విద్యార్థులు పొందుతారన్నారు. బీసీలు వికాసం పొందాలన్న ఉద్దేశంతోనే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని భావించామని, ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే అమలు దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరిగినప్పుడే దేశం నిజమైన పురోగతిని సాధిస్తుందన్న పూలే స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం పునరంకితమవుతుందన్నారు.