చానళ్ల పాత్ర ప్రశంసనీయం
పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రసారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే బాధ్యతను తెలుగు టీవీ చానళ్లు తీసుకోవడం ప్రశంసనీయమని సినీ నటి మంచులక్ష్మి అన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రసారం చేసి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే బాధ్యతను తెలుగు టీవీ చానళ్లు తీసుకోవడం ప్రశంసనీయమని సినీ నటి మంచులక్ష్మి అన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌డెక్కన్‌లో గురువారం సాయంత్రం ఏడో యూనిసెఫ్ అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. గౌరవ అతిథిగా హాజరైన మంచులక్ష్మి మాట్లాడుతూ...పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, సంరక్షణ తదితర అంశాలపై టెలివిజన్ చానళ్లు కథనాలు ప్రసారం చేసి పిల్లల సమస్యల గొంతుకగా మారడం అభినందనీయమన్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, గోపాల కృష్ణ గోఖలే అవార్డు గ్రహీత ఎస్.ఉమాపతి మాట్లాడుతూ... టీవీ చానళ్లలో ప్రసారమైన పిల్లల సమస్యల కథనాలు బాగున్నాయని, అయితే వీటికి న్యాయ సంబంధమైన అభిప్రాయాలు కూడా చొప్పిస్తే అర్థవంతంగా ఉంటుందన్నారు.
అవార్డులు అందుకున్న చానళ్లివే..
ఐ న్యూస్ (స్ఫూర్తిదాయకం ఇంటర్ బాలిక-అనూష శీర్షికతో కథనం), టీవీ9(పసి వయస్సులో ప్రాణాంతక చక్కెర వ్యాధి), వీ6(సమస్యల మండటం గట్టు కథనం), జెమినీ న్యూస్(అమ్మానాన్న దూరమైతే..), ఈటీవీ ఏపీ(డిటెన్షన్ అవసరమా, అనర్థమా..?పై చర్చ, ర్యాగిం గ్ రాక్షసిపై కథనం), హెచ్‌ఎంటీవీ(దేవరకొండ అమ్మాయిలు), వనిత టీవీ(అక్షరధామం...హతునూర్ మండలం అనే కథనం), 10 టీవీ(మాతాశిశు మరణాలపై కథనం)లకు అవార్డులు దక్కాయి. ఏపీ, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల యూనిసెఫ్ ఆఫీస్ చీఫ్ ఫీల్డ్ రూత్ లియోనో, సీఎంఎస్ డెరైక్టర్ పీఎన్ వసంతి పాల్గొన్నారు.