'యువకులను ప్రలోభపెట్టి.. ఐఎస్ఐఎస్లో చేరుస్తున్నా'
హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మహిళా ఉగ్రవాది నిక్కీ జోసెఫ్ను శనివారం పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. నిక్కీ జోసెఫ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. యువకులను ప్రలోభపెట్టి.. ఐఎస్ఐఎస్లో చేరుస్తున్నటుగా నిక్కీ జోసెఫ్ అంగీకరించింది. జడ్జి.. నిక్కీ జోసెఫ్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ జోసెఫ్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని, ఈమె ఇంగ్లండ్ దేశస్థురాలని తెలుస్తోంది. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్తో పరిచయం అయ్యింది. ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయింది. ఆమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్కు రప్పించి అరెస్ట్ చేశారు.