జాబుల జాడే లేదు
Published Tue, Aug 23 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
ముషీరాబాద్: తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగమని, బాబు వస్తే జాబు వస్తుందని హామీలిచ్చిన కేసీఆర్, చంద్రబాబు గద్దెనెక్కి 27 నెలలు గుడుస్తున్నా ఉద్యోగాల జాడ లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగులు ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయన్నారు. సోమవారం ముషీరాబాద్‌లోని కషీష్ ఫంక్షన్‌హాల్‌లో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల నిరుద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ఊదరగొట్టిన చంద్రబాబు టీచర్ పోస్టులు మినహా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదన్నారు. ఏపీలో 1.45లక్షల ఖాళీలు ఉండగా, 10వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం నిర్ణయించడం దారుణమన్నారు. గ్రూప్ – 1,2,3 పోస్టులను పాత పద్దతిలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులు కాంట్రాక్టర్లకు, నీళ్లను సముద్రానికి, నియామకాలను గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటి వరకు కేవలం 3వేల ఇంజనీరింగ్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. గ్రూప్ – 2 సర్వీస్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సంస్కరణలు ఉద్యోగ భర్తీలో కాకుండా రాజకీయాల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో గుజ్జకృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, సయ్యద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement