మీ సర్టిఫికెట్లు ఇక ఎంతో భద్రం..!
♦ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్న రాష్ట్ర సర్కారు
♦ ఉచితంగా వెయ్యి సర్టిఫికెట్లు,ఇతర ధ్రువపత్రాలను దాచుకునే వెసులుబాటు
♦ పౌర సేవలందించే 17 విభాగాలతో అనుసంధానం
♦ పేపర్ లెస్ గవర్నెన్స్ అమలులో భాగంగా ప్రభుత్వం చర్యలు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియాకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ‘డిజిటల్ లాకర్’ సదుపాయాన్ని అమల్లోకి తేవాలని ఐటీశాఖ నిర్ణయిం చింది. వివిధ ప్రభుత్వ విభాగాలు జారీచేసిన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లను ఈ-డాక్యుమెంట్ల రూపంలో డిజిటల్ లాకర్‌లో దాచుకునేందుకు వీలుంటుంది. ఇంటర్వ్యూలు, మరేదైనా సమయంలో డిజిటల్ లాకర్లోని సర్టిఫికెట్లు/డాక్యుమెంట్లను ఉన్నతాధికారులు పరిశీలించేందుకు, ధ్రువీకరించేందుకు అవకాశం లభిస్తుంది.
కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ పరిధిలోని ఎలక్ట్రానిక్స్ విభాగం సహకారంతో రాష్ట్రంలో ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలను డిజిటల్ లాకర్ ప్రక్రియలో భాగస్వాములను చేయనుంది. ఆయా ప్రభుత్వ విభాగాలు పౌరులకు జారీ చేసే ధ్రువపత్రాలు, ఇతర డాక్యుమెం ట్లను ఎలక్ట్రానిక్ రిపోసిటరీ ద్వారా డిజిటల్ లాకర్‌లో పొందుపరచనున్నారు. ఇలా పొందుపరిచిన డాక్యుమెంట్లను అవసరమైనపుడు సం బంధిత ప్రభుత్వ విభాగాలతో పాటు పౌరులు/యజమాని ఆమోదం మేరకు ప్రైవేటు సంస్థలు కూడా పరిశీలించేందుకు, ధ్రువీకరించేందుకు వెసులుబాటు కలుగనుంది.
వెయ్యి పత్రాలు దాచుకోవచ్చు
డిజిటల్ లాకర్‌లో ఒక్కో వ్యక్తి తనకు సంబంధించిన ముఖ్యమైన ధ్రువపత్రాలు/వ్యక్తిగత డాక్యుమెంట్ పేపర్లను 1,000 వరకు దాచుకునేందుకు వీలుంది. పౌరుడి డిజిటల్ లాకర్ ఖాతాకు ఉచితంగా ఒక జిగా బైట్ స్పేస్(ఖాళీ) ఉంటుంది. సర్టిఫికెట్లపై స్వీయ ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ లాకర్‌లో ఖాతా కలిగిన పౌరులు డిజిటల్ సిగ్నేచర్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సర్టిఫికెట్లు పోతాయనిగానీ, పాడై పోతాయనిగానీ బెంగ అక్కర్లేదు. వివిధ కార్యాలయాలకు, ఇంటర్వ్యూల సమయంలో ఒరిజనల్ ధ్రువపత్రాలను, జిరాక్స్ ప్రతులను భౌతికంగా వెంట బెట్టుకొని వెళ్లాల్సిన పని ఉం డదు. పౌరసేవలను అందించే 17 ప్రభుత్వ విభాగాలను సమన్వయ పరిచి త్వరలోనే డిజి టల్ లాకర్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది.
ఏ విభాగం నుంచి ఏ ధ్రువపత్రాలు..?
డిజిటల్ లాకర్‌లో అనేక పత్రాలు దాచుకునే వీలుంటుంది. రెవెన్యూ శాఖ జారీ చేసే కుల, ఆదాయ, నివాస, నిరభ్యంతర(ఎన్‌వోసీ) పత్రాలు, ఆర్‌వోఆర్, అడంగల్, పీపీబీ తదితర రెవెన్యూ రికార్డులు, పోలీసుశాఖ ఇచ్చే క్యారెక్టర్ సర్టిఫికెట్, ఎన్‌వోసీ, బందోబస్తుకు అనుమతి, విద్యాశాఖకు సంబంధించి వివిధ పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలు, విద్యా సంస్థ లు ఇచ్చే సర్టిఫికెట్లు, ఇతర శాఖలు కార్డులు, సర్టిఫికెట్లను జారీ చేసే సమయంలోనే ఆయా శాఖల నుంచి నేరుగా పౌరుడి డిజిటల్ లాకర్ ఖాతాలో పొందు పరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే https://digilocker.gov.in/వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అయి డిజిటల్ లాకర్ ఖాతాను ఎవరైనా పొందేందుకు వీలు కల్పించామని, ఆధార్ లేదా మొబైల్ నెంబర్‌తో ఖాతాలను యాక్టివేట్ చేసుకోవచ్చని ఐటీ అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని సేవలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు.