కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లు | nodal officers for new districts | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లు

Published Fri, Sep 9 2016 3:42 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

nodal officers for new districts

పాలనాపర ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు నిర్ణయం
 ప్రస్తుత జిల్లా అధికారులకే బాధ్యతలు
 పరిపాలన గాడిలో పడేంత వరకు కొనసాగింపు
 అన్ని విభాగాల్లో ఉద్యోగులకు కొత్త జాబ్ చార్ట్‌లు
 డివిజన్ స్థాయి పోస్టుల పునర్వ్యవస్థీకరణకు యోచన
 ప్రమోషన్లు, కొత్త పోస్టులకు డీపీసీ సమావేశాలు
 నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
 జిల్లా స్థాయిలో 20 విభాగాల విలీనానికి పచ్చజెండా
 రాష్ట్రస్థాయిలో మాత్రం ప్రస్తుత విధానమే అమలు
 
 సాక్షి, హైదరాబాద్:  జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కొత్త జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జిల్లాలో ఉన్న అధికారులు తమ పరిధిలోని కొత్త జిల్లాల్లో సంబంధిత విభాగాలకు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించాలని ఆదేశించింది. పరిపాలన గాడిలో పడేంత వరకు ఈ విధానాన్ని కొనసాగించే అవకాశముంది. ఇక అన్ని విభాగాలకు కొత్త జాబ్ చార్ట్‌లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. కొత్త జిల్లాల పాలనకు వీలుగా అధికారులు, ఉద్యోగుల హోదాలు, పాలనా స్వరూపంలో మార్పులు చేస్తున్న నేపథ్యంలో జాబ్‌చార్ట్‌లను మార్చుతున్నారు. ఈ మేరకు అన్ని శాఖలు ఈ జాబ్ చార్టులను తయారు చేసేందుకు విభాగపరమైన వర్క్‌షాప్‌లు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇక కొన్ని జిల్లా స్థాయి పోస్టులను రెండు, మూడు జిల్లాల పరిధికి విస్తరించేలా రీజినల్ స్థాయిగా మార్చే ప్రతిపాదనలను సిద్ధం చేసింది. న్యాయ, చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతమున్న డివిజినల్ స్థాయి పోస్టులను పునర్వ్యవస్థీకరించే ప్రతిపాదనలను సైతం రూపొందించింది.
 
 డీపీసీ భేటీలకు ఆదేశం...
 కొత్త జిల్లాల్లో సీనియర్ అధికారులు, ఉద్యోగుల అవసరం దృష్ట్యా ఉద్యోగుల ప్రమోషన్లు, కొత్త పోస్టుల నియామకాలకు వీలుగా అన్ని విభాగాలు డిపార్టుమెంటల్ ప్రమోషన్ కౌన్సిల్ (డీపీసీ) సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను జీఏడీ సర్వీస్ విభాగానికి, ఆర్థిక శాఖకు అందజేయాలనే మార్గదర్శకాలను రూపొందించింది. వీటితో పాటు ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
 
 మరిన్ని కొత్త డివిజన్లు, మండలాలు!
 కొత్తగా మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నోటిఫై చేసిన వాటికి అదనంగా ప్రజల డిమాండ్లకు అనుగుణంగా మరిన్ని డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ఆమోదం తెలిపారు. ఈ మేరకు రెండు రోజుల కింద జరిగిన కలెక్టర్ల సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త ప్రతిపాదనలపై శుక్రవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
 కేటాయింపు, సర్దుబాట్లపైనా సమీక్ష
 కొత్త జిల్లాలలో ఉద్యోగుల కేటాయింపు, సర్దుబాటుకు తుది రూపమిచ్చే అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చిస్తారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలలో పరిపాలనా యూనిట్లు, ప్రతిపాదిత ఉద్యోగుల సంఖ్య, సిబ్బంది నమూనా వివరాలపై సమీక్షించనున్నారు. వీటితోపాటు విభాగాల విలీనానికి అనుగుణంగా కొత్త జిల్లాల్లో నిర్ణీత అధికారులు, ఉద్యోగుల నమూనాను రూపొందిస్తారు. ఇక కార్యాలయాలకు అవసరమైన ఫర్నీచర్, మౌలిక సదుపాయాల వివరాలనూ పరిశీలించనున్నారు. మొత్తంగా దాదాపు పన్నెండు అంశాలపై చర్చించేలా ఎజెండాను రూపొందించారు. ఆ వివరాలన్నింటితో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని సాధారణ పరిపాలన విభాగం (రాజకీయ) ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా అన్ని జిల్లాల కలెక్టర్లకు సమాచారమిచ్చారు.
 
 20 విభాగాల విలీనం
 కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏర్పడే అధికారులు, ఉద్యోగుల కొరతను అధిగమించేందుకు దాదాపు ఇరవై విభాగాల విలీనానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పనితీరు ఒకే విధంగా ఉన్న విభాగాలను జిల్లా స్థాయిలో ఒకే పరిధిలోకి తెస్తోంది. రాష్ట్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా.. జిల్లా, ఆ కింది స్థాయిలోనే విభాగాలను విలీనం చేసే నమూనాను రూపొందిస్తోంది. అంతేగాకుండా జిల్లాస్థాయిలో ఉండే అధికారుల పోస్టులకు ఇప్పుడున్న పేర్లకు బదులుగా ఒకే తరహాలో నామకరణం చేయాలని నిర్ణయించింది. మొత్తంగా జిల్లా స్థాయి అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నా... వారిని మొత్తం 27 జిల్లాలకు సర్దుబాటు చేయవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసు చేసింది.
 
 ఒకే అధికారి పరిధిలోకి..
 ప్రస్తుతం జిల్లాస్థాయిలో డీఆర్‌డీఏ, డ్వామా, సెర్ప్ విభాగాలు వేర్వేరుగా ఉన్నాయి. అన్నింటికీ ప్రాజెక్టు డెరైక్టర్ (పీడీ) హోదాలో జిల్లా అధికారులు ఉన్నారు. ఈ మూడింటినీ కలిపి ఒకే ప్రాజెక్టు డెరైక్టర్ పరిధిలో ఉంచుతారు. దీంతో ప్రస్తుతం పది జిల్లాల్లో ఉన్న మిగతా పీడీలు, ఏపీడీలను కొత్తగా ఏర్పడే 17 జిల్లాలకు పీడీలుగా నియమించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖలు వేర్వేరుగా ఉన్నాయి. ఇకపై జిల్లాస్థాయిలో ఈ మూడు విభాగాలు ఒకే అధికారి పరిధిలో ఉంటాయి.
 
 జాయింట్ డెరైక్టర్లు, డిప్యూటీ డెరైక్టర్ హోదాలేమీ లేకుండా.. ఈ మూడు విభాగాలను పర్యవేక్షించే జిల్లా స్థాయి అధికారిని జిల్లా వ్యవసాయ అధికారిగా పిలుస్తారు. ఇక ఇప్పుడు జిల్లాల్లో ఉన్న మెప్మా పీడీలను తొలగించి... జిల్లా కేంద్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లనే మెప్మా పీడీలుగా నోటిఫై చేస్తారు. ప్రస్తుతం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి జిల్లా స్థాయిలో ఈఈలు అధికారులుగా ఉన్నారు. కొత్త జిల్లాల్లో సర్దుబాటు చేసేందుకు ఈఈలు, డిప్యూటీ ఈఈలను ఆయా పోస్టుల్లో నియమిస్తారు. హోదాల తారతమ్యం లేకుండా వారిని అన్ని జిల్లాల్లో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్‌గా పిలుస్తారు. ప్రస్తుతం జిల్లాల్లో డెరైక్టర్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లున్నారు.
 
 మున్సిపాలిటీల్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లకు హోదా పెంచి ఈ పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విభాగాలకు ప్రస్తుతం జిల్లాల్లో వేర్వేరుగా అధికారులున్నారు. ఆ పోస్టులన్నింటినీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి పరిధిలోకి తీసుకువస్తారు. ఒకే అధికారి కింద నాలుగు యూనిట్లుగా సేవలు అందిస్తాయి. దీంతో ఒకే అధికారి పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పుడున్న ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండదు. జిల్లాల్లో వేర్వేరుగా ఉన్న సర్వశిక్షా అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, విద్యాశాఖలు జిల్లా విద్యాశాఖాధికారి పరిధిలోనే పనిచేస్తాయి. అటవీశాఖ, సామాజిక వనసంరక్షణ, వన్యప్రాణి విభాగాలన్నీ ఒకే జిల్లా అటవీ శాఖ అధికారి పరిధిలో చేర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement