అన్ని పనులకూ.. నంబర్ 139 | Number 139 to all works | Sakshi
Sakshi News home page

అన్ని పనులకూ.. నంబర్ 139

Published Sun, May 15 2016 6:35 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

అన్ని పనులకూ.. నంబర్ 139

అన్ని పనులకూ.. నంబర్ 139

 రైళ్లకు సంబంధించిన వివరాలు, వచ్చే సమయం, తిరిగి బయలుదేరే వేళలు, గమ్యస్థానానికి చేరుకునే సమయాలు, ఏసీ బోగీలు, స్లీపర్ క్లాసు.. ఇలా అన్ని వివరాలనూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఖాళీ సీట్ల వివరాలు, టికెట్ కొన్న తర్వాత సీటు/బెర్తు కేటాయించిందీ లేనిదీ, వెయిటింగ్ లిస్టులో మన పీఎన్‌ఆర్ స్థితి ఏమిటనేది వివరిస్తుంది. రైళ్ల సమయాలు, చార్జీలు, సమయాల్లో మార్పుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

►మన టికెట్ పీఎన్‌ఆర్ నంబర్‌ను 139కి ఎస్సెమ్మెస్ చేస్తే క్షణాల వ్యవధిలోనే పీఎన్‌ఆర్ నంబర్ స్థితితో పాటు రైలు బయలుదేరే వేళలు, గమ్యస్థానానికి చేరుకునే సమయం తదితర వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో మనకు అందుతాయి.
► ఇప్పటివరకు సమాచారం తెలుసుకోవడం వరకే పరిమితమైన 139 నంబర్‌ను టికెట్ క్యాన్సిల్ చేసుకోవటానికీ అనుసంధానించారు. ఈ వెసులుబాటు రైల్వే కౌంటర్‌లో కొన్న కన్ఫర్మేషన్ టికెట్‌కు మాత్రమే వర్తిస్తుంది. అలాంటి టికెట్ ఉన్నవారు దాన్ని రద్దు చేసుకోవాలంటే రైలు బయలుదేరడానికి నాలుగు గంటలు ముందు 139కు ఫోన్ చేసి సమాచారం అందించి, పీఎన్‌ఆర్ నంబర్‌ను తెలపాలి. ఆ కాల్ లైన్‌లో ఉండగానే మన సెల్ (టికెట్ బుక్ చేసేప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్)కు వన్‌టైం పాస్‌వర్డ్ వస్తుంది. ఆ పాస్‌వర్డ్‌ను 139లో మాట్లాడుతున్న రైల్వే ఉద్యోగికి తెలిపితే.. వారు టికెట్‌ను రద్దు చేస్తారు. ఈ సమాచారం ఎస్సెమ్మెస్ రూపంలో మనకు చేరుతుంది. రైలు బయలుదేరిన నాలుగు గంటలలోపు సమీపంలోని రైల్వే కౌంటర్‌కు వెళ్లి టికెట్‌తోపాటు రద్దయినట్టు వచ్చిన ఎస్సెమ్మెస్‌ను చూపితే నిర్ధారిత సర్వీసు చార్జీ మినహాయించి, మిగతా టికెట్ సొమ్మును తిరిగిస్తారు. సాయంత్రం ఆరు తర్వాత బయలుదేరే రైలు అయితే.. ఆ సమయంలో కొన్ని స్టేషన్‌లలో కౌంటర్లు మూసి ఉంటాయి. అలాంటి చోట మరుసటి రోజు ఉదయం కౌంటర్ తెరిచిన రెండు గంటలలోపు వెళ్తే డబ్బు చెల్లిస్తారు.
►ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లు, ఐఆర్‌సీటీసీ అనుబంధ ప్రైవేటు కౌంటర్‌లలో కొన్న టికెట్లను మాత్రం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. రైల్వే కౌంటర్‌లో కొని కన్ఫర్మ్ కాని టికెట్‌కు కూడా ఇది వర్తించదు. వెయిటింగ్ లిస్టు చూపుతున్న టికెట్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ఆన్‌లైన్ టికె ట్ ఆర్‌ఏసీలో ఉన్నప్పుడు రద్దు చేసుకోదలిస్తే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ‘టికెట్ డిపాజిట్ రిసీట్’ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైలు బయలుదేరడానికి అరగంట ముందు ఈ పని పూర్తి చేస్తే మన బ్యాంకు ఖాతాకు టికెట్ సొమ్ము తిరిగి వచ్చేస్తుంది.
►ఒక్కోసారి టికెట్ కొన్నప్పుడు వెయిటింగ్ లిస్టులో చూపుతుంది. తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. అలాంటప్పుడు రిజిస్టర్డ్ సెల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. దాన్ని చూసుకోవాలి. చూసుకోకుండానే టికెట్ కన్‌ఫర్మ్ కాలేదనుకుని తీరిగ్గా చార్ట్ ప్రిపేరయ్యాక రద్దవుతుందనుకుంటే.. పైసా కూడా వెనక్కి రాదు.
 
 ఫిర్యాదు చేయాలా...?
 రెలైక్కిన తర్వాత ఏదైనా సమస్య ఎదురైనా, రైల్వేకు ఏదైనా సూచన చేయాలన్నా.. మీ టికెట్ పీఎన్‌ఆర్ నంబర్‌ను పేర్కొంటూ 8121281212కు ఎస్సెమ్మెస్ చేయవచ్చు. దీంతో వెంటనే సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. ఇది పూర్తిగా దక్షిణ మధ్య రైల్వేకు పరిమితం.

  ప్రయాణికుల రక్షణ కోసం రైల్వే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా 182 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రైల్లో మీ భద్రతకు ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఈ నంబర్‌కు మీ పీఎన్‌ఆర్ నంబర్‌ను పేర్కొంటూ ఎస్సెమ్మెస్ చేయాలి. దాంతో వెంటనే పోలీసు సిబ్బంది మీ సీటు వద్దకు వచ్చి సహాయం అందజేస్తారు. ఇది ఒంటరిగా ప్రయాణించే మహిళలకు ఎంతో ఉపయుక్తం.

  మీ బోగీ అపరిశుభ్రంగా ఉంటే ‘క్లీన్ మై కోచ్’ పేరుతో కొత్తగా 58888 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. క్లీన్ అని రాసి స్పేస్ ఇచ్చి మీ పీఎన్‌ఆర్ నంబర్ టైప్ చేసి ఎస్సెమ్మెస్ పంపితే... సిబ్బంది వచ్చి రైలు నడుస్తుండగానే బోగీని శుభ్రం చేస్తారు. ప్రస్తుతం ద.మ. రైల్వే పరిధిలోని 40 రైళ్లలో క్లీనింగ్ సిబ్బందిని నియమించారు.

  ప్రతి రైల్లో ఎస్కార్ట్ పోలీసులు ఉంటారు. వారు అటూ ఇటూ గస్తీ తిరుగుతుంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని వెతికి పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ప్రతి రైలులోని ఎస్-1 బోగీలో 63వ నంబర్ సీటు వద్ద నిరంతరం ఒక పోలీసు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్లి సహాయం పొందవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement