సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య సేవలు అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: చాంతాడంత వెయిటింగ్ లిస్టు... చార్ట్ సన్నద్ధమయ్యే వరకూ ఉత్కంఠగా ఎదురుచూపు... చివరకు బెర్త్ కన్‌ఫర్మ్ కాకపోతే చేసేది లేక ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ఊరట కల్పించే ‘వికల్ప్’ పథకాన్ని ఇటీవల దక్షిణ మధ్య రైల్వే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. మొదటగా హైదరాబాద్- ఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, ఏపీ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ పథకాన్ని ప్రారంభించింది. వీటిలోని ఏదైనా రైలులో వెయిటింగ్ లిస్టులో ఉన్నవారు ఆ తరువాత వచ్చే రైలును ఆప్షన్‌గా ఎంపిక చేసుకోవచ్చు.
ఉదాహరణకు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ నిరీక్షణ జాబితాలో ఉన్నవారు మరో ఆప్షన్‌గా దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ తొలుత కోరుకున్న రైలులో బెర్తు పొందలేకపోతే తరువాతి రైలులో బెర్తులు ఖాళీగా ఉంటే వాటిని కేటాయిస్తారు. గతేడాది న్యూఢిల్లీ- జమ్మూ, న్యూఢిల్లీ-అమృత్‌సర్ మార్గాల్లో ప్రవేశపెట్టిన ‘వికల్ప్’ సత్ఫలితాలివ్వడంతో... తాజాగా ఈ పథకాన్ని హైదరాబాద్-న్యూఢిల్లీ ప్రయాణికులకూ అందుబాటులోకి తెచ్చారు. దీన్ని వినియోగించుకొనేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకొనే సమయంలోనే ‘ఆల్టర్నేట్ ట్రైన్ అకామడేషన్ స్కీమ్’ (ఏటీఏఎస్) ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. టికెట్ ధర తక్కువగా ఉంటే వారి ఖాతాలో జమవుతుంది. అధికంగా ఉంటే ప్రయాణికులు ప్రయాణ సమయంలో చెల్లించాలి.
ఎమర్జెన్సీ కోటా దుర్వినియోగానికి కళ్లెం...
ఎమర్జెన్సీ కోటా బెర్తులు తరచుగా దుర్వినియోగం కావడం, అనర్హులు, ట్రావెల్ ఏజెంట్లు ఏదోలా వాటిని దక్కించుకొని సొమ్ము చేసుకోవడం వల్ల ముందుగా బుక్‌చేసుకున్న ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా ఎమర్జెన్సీ కోటా కింద స్లీపర్ క్లాసులో 30 నుంచి 40, థర్డ్ ఏసీలో 6, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలో 4 చొప్పున బెర్తులు కేటాయిస్తారు. ఎంపీలు, మంత్రులు, వీఐపీల కోసం, అత్యవసర సమయాల్లో ప్రయాణించవలసిన రైల్వే అధికారులు, లోకో పైలట్ తదితరుల కోసం ఈ బెర్తులుంటాయి. కానీ రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో ఈ కోటా బెర్తులు దుర్వినియోగమవుతున్నట్లు రైల్వే శాఖ గుర్తిం చింది. దీన్ని అరికట్టేందుకు ‘వికల్ప్’కు శ్రీకారం చుట్టారు.
త్వరలో మరిన్ని రద్దీ రూట్లకు విస్తరణ...
‘వికల్ప్’ పథకాన్ని దశలవారీగా రద్దీగా ఉండే సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, కాచిగూడ-బెంగళూరు వంటి మార్గాల్లో ప్రవేశపెడతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
‘వెయిటింగ్ లిస్టు’కు ‘వికల్ప్’ ఊరట
Published Tue, Jun 7 2016 4:08 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM
Advertisement
Advertisement