అధికారిక ఆమోద ముద్ర | Official approval | Sakshi
Sakshi News home page

అధికారిక ఆమోద ముద్ర

Published Tue, Jul 26 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

► హెచ్‌ఎండీఏఎ పరిధి మరింత విస్తృతం
► పలు ప్రాజెక్టులకు మంత్రి కేటీఆర్‌ ఆమోదం
► రెండేళ్లలో  బాటసింగారం, మంగళ్‌పల్లి లాజిస్టిక్స్‌ పార్క్‌లు
► బాపూఘాట్, ఉప్పల్‌ భగత్‌ లేఅవుట్‌ల వద్ద మూసీ
    పరిసరాల సుందరీకరణ
► హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులు, భవిష్యత్‌ కార్యచరణపై మంత్రి సమీక్ష




సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులకు మోక్షం కలుగనుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనుల నిర్వహణకు మంత్రి పచ్చజెండా ఊపారు. మరో వారంలో రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారికంగా అనుమతులు రానున్నాయి. హెచ్‌ఎండీఏ చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతి, నూతన ప్రతిపాదనలు, భవిష్యత్‌ కార్యాచరణపై మంత్రి కె. తారక రామారావు సమీక్షించారు. మంగళవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

విజయవాడ హైవే ఉన్న బాటసింగారం, నాగార్జునసాగర్‌ రహదారిలో మంగళపల్లి వద్ద రెండు లాజిస్టిక్స్‌ పార్క్‌ల ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. బాట సింగారం వద్ద రూ. 35 కోట్లతో 40 ఎకరాల్లో, మంగళపల్లి వద్ద రూ. 20 కోట్ల వ్యయంతో 20 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌లను పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియడంతో.. రెండేళ్లలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. సరుకు, ప్రయాణికుల రవాణా వాహనాలు పార్క్‌ చేసేందుకు వీలుగా మియాపూర్‌లో ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు మంత్రి అంగీకరించారు. రూ. 100 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ టెర్మినల్‌ను మెట్రో రైలు మార్గంతో అనుసంధానించాలన్నారు.

 

భువనగిరి, తిమ్మాపూర్, ఈదుల నాగులపల్లి, మనోహరాబాద్, రావులపల్లిలోనూ సరుకు రవాణా టెర్మినళ్లు ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండీఏ గతంలో చేసిన ప్రతిపాదన ను మంత్రి ప్రస్తావిస్తూ.. ఈ విషయమై లాజిస్టిక్‌ స్టేక్‌ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు. పీపీపీ పద్ధతిలో అమీర్‌పేటలో 1600 గజాల్లో మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు.

65 ఎకరాల్లో ఎకో పార్క్‌..
శంషాబాద్‌ మండలంలోని కొత్వాల్‌గూడలో ఎకో పార్క్‌ ఏర్పాటుకు మంత్రి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. 65 ఎకరాల్లో అక్వాటిక్‌ బర్డ్, బటర్‌ ఫ్లై పార్క్, పల్లె వాతావరణం ప్రతిబింబించేలా హట్స్, పబ్లిక్‌ పార్క్, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, అగ్రో పార్క్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. వచ్చే పదేళ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. రెండు నెలల్లో ఈ అంశంపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

 

హెచ్‌ఎండీఏలో ప్రతి ప్రాజెక్టు కీలకమని, సమష్టి కృషితో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నగర జనాభా పెరుగుతున్న దృష్ట్యా హెచ్‌ఎండీఏ పరిధిని విస్తరించాలని,నిధుల సేకరణలో వినూత్న పద్ధతులు అవలంభించాలని సూచించారు. రీజినల్‌ రింగ్‌ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్‌)పై చర్చించిన మంత్రి... 283 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుందని సూత్రప్రాయంగా వెల్లడించారు. ఈ మార్గంలో నాలుగు, ఆరు లేన్ల రోడ్ల నిర్మాణానికి విడివిడిగా అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.

రెండు కొత్త ప్రాజెక్టులు..
బాపూఘాట్, ఉప్పల్‌ భగత్‌ లేఅవుట్‌ వద్ద మూసీ పరిసర ప్రాంతాలను సుందరీకరించనున్నట్లు తెలిపారు. బాపూఘాట్‌ వద్ద ఈసా, మూసీ నదులు కలిసే చోట 60 ఎకరాల్లో సుందరీకరణ పనులు చేపడతామని తెలిపారు. అయితే ఇక్కడి భూమి పర్యాటకశాఖ అధీనంలో ఉండడంతో త్వరలో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్‌ భగత్‌ వద్ద మూడు ఎకరాల్లో సుందరీకరణ చేస్తామన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement