ముహూర్తం ఖరారు
* ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ
* జనవరి 11న కంటోన్మెంట్ ఎన్నికలు
* పార్టీలకు అతీతం... పోలింగ్‌లో బ్యాలెట్
* అంతా మిలటరీ అధికారుల కనుసన్నల్లోనే...
కంటోన్మెంట్: ఎట్టకేలకు కంటోన్మెంట్ ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది జనవరి 11న బోర్డు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఒక్కసారిగా స్థానిక రాజకీయాలు వేడెక్కాయి. మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన సుమారు 2.30 లక్షల మంది ఓటర్లు... ఎనిమిది మంది సభ్యులను బోర్డుకు ఎన్నుకుంటారు. పార్టీలకు అతీతంగా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రత్యేక ఓటరు జాబితాను వినియోగించనున్నారు.
కొత్త చట్టం వచ్చాక రెండోసారి...
కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో ‘ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006’ అమల్లోకి వచ్చాక ఎన్నికలు నిర్వహించడం ఇది రెండోసారి. ఈ చట్టం ప్రకారం తొలిసారి 2008 మే 18లో జరిగిన ఎన్నికల ద్వారా సికింద్రాబాద్‌లో తొలి పాలకమండలి
ఏర్పాటైంది. 2013 జూన్ 5తో ఈ పాలకమండలి గడువు పూర్తయినప్పటికీ, రెండుసార్లు పొడిగించారు. ఈ ఏడాది జూన్ 5తో తొలి పాలక మండలి గడువు ముగిసింది. అప్పటి నుంచి మిలటరీ అధికారి అయిన బోర్డు అధ్యక్షుడు, మెంబర్ సెక్రటరీగా వ్యవహరించే సీఈఓల ఆధ్వర్యంలోని ప్రత్యేక బోర్డు ఆధ్వర్యంలోనే పాలన కొనసాగుతోంది.
ఇదీ బోర్డు స్వరూపం
దేశ వ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులలో ఒక్కటి మినహా 61 చోట్ల ప్రజల ద్వారా ఎన్నికైన సభ్యులతో కూడిన బోర్డు కొలువుదీరుతుంది. జనాభా పరంగా నాలుగు కేటగిరీలుగా వీటిని విభజించారు. వీటిలో అత్యధిక జనాభాతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అతి పెద్దదిగా కొనసాగుతోంది. మొత్తం 16 మంది సభ్యులు ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు స్థానిక మిలటరీ స్థావరం కమాండర్ (జీఓసీ-ఇన్-సీ) లేదా, అతని ద్వారా నియమితులైన బ్రిగేడియర్ ర్యాంకు అధికారి అధ్యక్షుడిగా ఉంటారు. బోర్డు సీఈఓగా పనిచేసే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్‌కు చెందిన అధికారి సభ్య కార్యదర్శిగా కొనసాగుతారు.
ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉండే ఇద్దరు మిలటరీ అధికారులు హెల్త్ ఆఫీసర్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ ఆఫీసర్), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (గారిసన్ ఇంజనీర్)లతో పాటు మరో ముగ్గురు మిలటరీ అధికారులను అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. వీరితో పాటు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, లేదా అడిషనల్ మెజిస్ట్రేట్ స్థాయి అధికారి (డీఆర్‌ఓ)ని బోర్డు సభ్యుడిగా నామినేట్ చేస్తారు. అంటే మొత్తం 16 మందిలో 8 మంది ప్రజల చేత ఎన్నికైన సభ్యులు కాగా, ఆరుగురు మిలటరీ అధికారులు, ఒక ఐడీఈఎస్ అధికారి (సీఈఓ), రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి (మెజిస్ట్రేట్) సభ్యులుగా ఉంటారు.
ప్రత్యేక ఓటరు జాబితా
సాధారణంగా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే ఓటరు జాబితానే వినియోగిస్తారు. కంటోన్మెంట్‌లలో జరిగే ఎన్నికలకు మాత్రమే ప్రత్యేకంగా జాబితాను రూపొందిస్తారు. కంటోన్మెంట్ ఎలక్టోరల్ రూల్స్ -2007 ప్రకారం ఈ జాబితాను తయారు చేస్తారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు ఎన్నికల సంఘం రూపొందించిన జాబితా ఆధారంగా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో పాల్గొంటుండగా.. ప్రత్యేకమైన జాబితాలో పేరు నమోదు చేసుకుంటేనే బోర్డు ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులవుతారు.