- ఒక్కసారి ఊరువెళ్లి రా...
- పచ్చని పల్లెల కోసం...
-
అనుభూతుల మల్లెల కోసం...
సాక్షి, సిటీబ్యూరో : నగరం పల్లె‘టూరు’కెళ్లింది. స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లారు. పండగ ప్రయాణాల దృష్ట్యా గత మూడు రోజులుగా రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిటకిటలాడాయి. కార్లు, సొంత వాహనాలపై కూడా పలువురు సిటీజనులు ఊళ్లకు పయనమయ్యారు. మొత్తంగా ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు వివిధ మార్గాల్లో సుమారు 20 లక్షల మంది ప్రజలు సొంతూళ్లకు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లలో రిజర్వేషన్లు లభించకపోవడంతో చాలామంది ‘వస్తే రాని కష్టాల్.. బాధల్..’ అనుకుంటూ దూరప్రాంతాలకు సైతం కిక్కిరిసిన రైళ్లలో బయలుదేరారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. కానీ ప్రత్యేక బస్సులపై 50 శాతం చొప్పున ఆర్టీసీ అదనపు వసూళ్లకు పాల్పడింది. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందుకేసి డబుల్ చార్జీలు వసూలు చేశాయి. పైగా ఒక ట్రావెల్స్‌కు, మరో ట్రావెల్స్‌కు మధ్య పొంతన లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో చాలామందికి పండగ ప్రయాణం నరకప్రాయంగా మారింది.
పిల్లలు, పెద్దలు, మహిళలు మరింత ఇబ్బందికి గురయ్యారు. అయినప్పటికీ వారు రవాణా చార్జీల రూపంలో భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు అదనపు చార్జీల మోత భారీగా మోగింది. రోజువారీ బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాకుండా.. సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 43 రైళ్లను అదనంగా ఏర్పాటు చేసింది. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో పలు ప్రధాన రైళ్లకు పెద్దసంఖ్యలో అదనపు బోగీలను ఏర్పాటు చేశారు.
అయినప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు పూర్తి చేయలేకపోయాయి. మరోవైపు హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగించే 3500 బస్సులకు ఈ ఏడాది 4960 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. వీటిలో శనివారం నాటికి 3400 ప్రత్యేక బస్సులు నడిపినట్లు ఆ సంస్థ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు కాకుండా వెయ్యి ప్రైవేట్ బ స్సులు బయలుదేరాయి. మరో లక్షకు పైగా కార్లు, ఇతర వాహనాల్లో సైతం ప్రజలు తమ సొంత ఊళ్లకు బయలుదేరారు.
పొటెత్తిన ఎంజీబీఎస్
అఫ్జల్‌గంజ్ : సంక్రాంతి పండుగ సమీపించడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ శనివారం పొటెత్తింది. సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో సంతోషంగా కుటుంబ సమేతంగా నిర్వహించుకునేందుకు నగర నలుమూలల నుంచి ఉదయం నుంచే వివిధ జిల్లాలకు తరలి వెళ్లే ప్రయాణికుల తాకిడి అధికమైంది. ఆర్టీసీ అధికారుల అంచనాలను మించి ప్రయాణికులతో ఎంజీబీఎస్ రద్దీగా మారింది. ఎటుచూసినా జనంతో కిటకిటలాడింది.
ఈయే డు ప్రైవేట్‌బస్సుల సంఖ్య తగ్గడం, ఆర్టీఏ అధికారుల విస్తృతదాడులతో పండుగకు ఊరెళ్లే ప్రయాణికులంతా ఆర్టీసీ వైపు మొగ్గుచూపడంతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగింది. షె డ్యూల్డ్ బస్సుల రిజర్వేషన్ ప్రక్రియ ఈనెల 7వ తేదీన పూర్తి కావడంతో 8వ తేదీ నుంచి అదనపు బస్సులకు డిమాండ్ మరింత పెరిగింది. శనివారం ఒక్క రోజే 3557 షెడ్యూల్డ్ బస్సులకు అదనంగా రాత్రి 7 గంటల వరకు ఆర్టీసీ అధికారులు సుమారు 700 అదనపు బస్సులను నడిపారంటే ప్రయాణికుల రద్దీ ఎంతగా ఉందో ఇట్టే ఊహించవచ్చు.
పేరుకే అదనపు రైళ్లు
అదనపు రైళ్లని అధికారులు పేరుకే ప్రకటనలు చేశారు. ప్రయాణికుల సంఖ్యకు అదనపు రైళ్లు ఏమాత్రం సరిపోవడం లేదు. బయట బస్సుల్లో ఒక్క సీటు కోసం నాలుగింతలు వసూలు చేస్తున్నారు. ఇక్కడికొస్తే ఏ రైలులోనూ అడుగుపెట్టే పరిస్థితి లేదు.
- చిన్నారావు, శ్రీకాకుళం
ఉదయం నుంచి క్యూలోనే
వేలాది మందికి జనరల్ టికెట్లు ఇస్తున్నారు. బోగీలు నాలుగుకు మించి ఉండడం లేదు. జనరల్ బోగీలో నరకం చూడాల్సి వస్తుంది. సాయంత్రం రైలుకు వెళ్లేందుకు ఉదయం స్టేషన్‌కు చేరుకుని క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి.
-దోరయ్య, రాజమండ్రి
సమాచారం ఇచ్చేవారేరీ?
ఏ రైలు ఎప్పుడు వస్తుందో సమాచారం అందించేవారు లేరు. రైల్వేస్టేషన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకునేవారే లేరు. -శ్రీను, విజయవాడ
నరకం చూస్తున్నాం
ప్రతీపండగ సెలవులకు రైలుప్రయాణం నరకం చూపిస్తుంది. నెల ముందు రిజర్వేషన్ చేయించుకున్నా బెర్త్ కన్ఫర్మ్ కావడం లేదు. కనీసం జనరల్ ప్రయాణం చేద్దామంటే బోగీలో ఊపిరాడే పరిస్థితి లేదు. రైల్వే అధికారుల తీరు మారాలి. -వాసుదేవరావు
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ
పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నా రు. టికెట్ చార్జిల్లో ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సులు కాస్త బెటర్.
- ప్రభు(బక్కన్న), మోతీనగర్
అదనపు చార్జీలు దారుణం
ఆర్టీసీ అధికారులు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి అదనపు బస్సుల పేరిట 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం దారుణం. పండగ సంతోషాన్నికుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలన్న ఆనందాన్ని ఆర్టీసీ చార్జిల పెంపు తుడిచిపెట్టేస్తుంది.
- రాజు, మెహిదీపట్నం
‘ప్రైవేట్’ ఆగడాలకు అడ్డేదీ
ప్రైవేట్ బస్సుల నిర్వాహకుల ఆగడాలను అడ్డూ అదుపూ లేకుండాపోయింది. మదనపల్లికి సాధారణంగా రూ.630 టికెట్ చార్జికి ప్రైవేట్ బస్సు నిర్వాహకులు రూ.1500లు వసూలుచేస్తున్నారు.
- శ్రీనివాస్, గౌలిగూడ
ఆర్టీసీ బస్సులు లేవు
విజయవాడ వెళ్లేందుకు ఎల్‌బీనగర్ రింగురోడ్డుకు ఉదయం వచ్చాము. ఆర్టీసీ బస్సులు లేవు పిల్లలతో పడిగాపులు కాసి చివరకు ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించాం.
-ప్రకాశ్, విజయవాడ
సౌకర్యాలేవీ?
సదూర ప్రాంతాలకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ అధికారులు సరైన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయలేదు. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్‌టీసీ అధికారుల తీరు మారాలి.
-కిరణ్‌వెస్లీ, పాలకొల్లు