లక్ష ఎకరాలకు సాగు నీరు
సాక్షి, హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు (సమీకృత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం) పనులకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో మూడో వంతును ఒక్క ఏడాదిలోనే ఖర్చు చేసి లక్ష ఎకరాలకు సాగునీరందించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతోపాటు మరో లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనుంది. మంగళవారం ఖమ్మం జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల కింద ఇప్పటివరకూ చేసిన పనులను అనుసంధానం చేస్తూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపర్చేలా సీతారామ ప్రాజెక్టు తుది ప్రణాళిక ఖరారైన విషయం తెలిసిందే.
దీంతోపాటు 58వేల ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.90.87కోట్లతో భక్త రామదాసు ప్రాజెక్టును కూడా చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులతో మొత్తంగా 5.58 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. సీతారామ ప్రాజెక్టును రూ.7,967కోట్ల వ్యయంతో 2018-19 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది జూన్ నాటికే లక్ష ఎకరాల స్థిరీకరణ, మరో 50 వేల ఎకరాలకు నీరివ్వాలని... దీనికోసం రూ.2,790 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. భక్త రామదాసు ఎత్తిపోతలను కూడా ఇదే సమయంలో రూ.90.87కోట్లతో పూర్తిచేసి 58,958 ఎకరాలకు నీరివ్వనున్నారు. మొత్తంగా రూ.2,880 కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతోపాటు, మరో లక్ష ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించారు.
విసృ్తత ప్రయోజనాల కోసమే
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు వివరణ ఇచ్చారు. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా 27.3 టీఎంసీల నికర జలాలతో ఖమ్మం జిల్లాలో 3.33 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారని, ఈ పథకం అమలుకు 18కిలోమీటర్ల వన్యప్రాణి నివాస ప్రాంతం ప్రధాన ఆటంకంగా ఉందన్నారు. రాష్ట్ర విభజనతో 7 మండలాలు ఏపీకి వెళ్లడంతో ఇందిరాసాగర్ అంతరాష్ట్ర ప్రాజెక్టుకుగా మారిందన్నారు. దీనిపై అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకుందామని ప్రతిపాదించినా ఏపీ ముందుకు రాలేదని.. ఈ సమస్యలను శాశ్వతంగా అధిగమించేందుకు రెండు ప్రాజెక్టులను కలిపి సమీకృత ప్రాజెక్టుగా రూపొందించామని తెలిపారు.