టాప్‌ సింగర్‌ బ్యాంక్‌ ఖాతాల పేరుతో మోసం | Online cheating named of Korean top singer Bae Suzy with Bank accounts | Sakshi
Sakshi News home page

టాప్‌ సింగర్‌ బ్యాంక్‌ ఖాతాల పేరుతో మోసం

Published Wed, May 18 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

స్వాధీనం చేసుకున్న బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, నగదు

స్వాధీనం చేసుకున్న బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, నగదు

కొరియన్ టాప్ సింగర్ పేరుతోనూ బ్యాంక్ అకౌంట్
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షల్లో దండుకున్న ఆన్‌లైన్ నేరగాళ్లు
డబ్బుల బదిలీకి ఖాతాలు వినియోగించిన నిందితులు
మోసపోయిన ఐదుగురు నగరవాసులు
ముగ్గురు నిందితుల అరెస్టు

 
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లో నివసిస్తున్న కొరియన్ టాప్ సింగర్ బాయి సుజీ ఫొటోను ఉపయోగించి రెండు వేర్వేరు పేర్లతో రెండు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారు ఆన్‌లైన్ మోసగాళ్లు. ఇంటర్నెట్ నుంచి ఆమె ఫొటోలను డౌన్‌లోడ్ చేసి ఈ తతంగాన్ని పూర్తి చేశారు. అమెరికా, కెనడాల్లో ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి రూ.లక్షలు ఈ ఖాతాలకు బదిలీ చేయించారు. తాము డబ్బులు బదిలీ చేసింది కొరియన్ టాప్ సింగ్ బాయి సుజీ బ్యాంక్ ఖాతాకు అని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడవడంతో నిరుద్యోగులు అవాక్కయ్యారు. బృంద నాయకుడు, నైజీరియన్ వాసి జేమ్స్ మార్టిన్, క్రిస్టోఫర్, లాల్‌కన్హిమి, ఐజ్వాల్, మిజోరానికి చెందిన ఎమాన్యూల్ లల్తియాగిహ్లమా తదితరులు బెంగళూర్ కేంద్రంగా ఈ మోసానికి పాల్పడ్డారు.
 
 అమెరికా, కెనడా నంబర్లు వినియోగించి నిరుద్యోగులకు ఫోన్‌లు చేసి బడా కంపెనీల్లో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారని జీడిమెట్ల, ఎల్‌బీనగర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాధితులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ నేతృత్వంలోని బృందం శంషాబాద్‌లో క్రిస్టోఫర్, లాల్‌కన్హిమి, లల్తియాగిహ్లమాలను మంగళవారం అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.లక్ష, 15 బ్యాంక్ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, 13 పాన్‌కార్డులు, ఆరు ఓటరు ఐడీలు, 13 డ్రైవింగ్ లెసైన్స్‌లు, 22 ఏటీఎం కార్డులు, 15 సిమ్‌కార్డులు, ఆరు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
 
 ఖాతాలు తెరిచాక ఇళ్లు ఖాళీ..
 లాల్‌కన్హిమి, ఎమాన్యూల్ లల్తియాగిహ్లమాలు శంషాబాద్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. రెంటల్ అగ్రిమెంట్ కాపీ, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వివిధ బ్యాంక్‌ల్లో 70 ఖాతాలు ఓపెన్ చేశారు. బ్యాంక్ చెక్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు తీసుకున్నాక ఆ ఇంటి నుంచి నిందితులు వెళ్లిపోయారు. ఈ బ్యాంక్ ఖాతా వివరాలను నైజీరియన్లు జేమ్స్ మార్టిన్, క్రిస్టోఫర్‌లకు తెలిపారు. దీంతో వారు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల వివరాలు సేకరించి యూఎస్, కెనడాకు చెందిన ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు ఫోన్‌కాల్స్ చేసేవారు. బెంగళూర్ నుంచే వీరు మాట్లాడుతున్నా నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేందుకు కెనడా, అమెరికా సిమ్‌లు ఉపయోగించేవారు. భారీ ప్యాకేజీతో పాటు ఇన్సూరెన్స్ కవరేజీ, ఇళ్లు, కారు, స్వదేశానికి వెళ్లేందుకు రెండు నెలల పాటు సెలవులు ఉంటాయని ఆశ కల్పించేవారు.
 
 వీరి ఉచ్చులో చిక్కుకున్న జీడిమెట్ల, ఎల్‌బీనగర్‌లకు చెందిన ఐదుగురు యువకులు తలా రూ.5 లక్షలు మోసపోయినట్లు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్ తెలిపారు. వీరు కొత్త మొబైల్ ఫోన్లు, సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయిస్తామని ఓఎల్‌ఎక్స్‌లో నకిలీ ప్రకటనలు ఇచ్చి చాలా మందిని మోసగించారని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్, సైబర్ క్రైమ్స్ ఏసీపీ జయరాం, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement