సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలికల్లో ఇకపై ఆన్‌లైన్ ద్వారానే అన్ని రకాల సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పురపాలికలకు పన్నులు, పన్నేతర ఆదాయాన్ని తెచ్చి పెట్టే సేవలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణను తప్పనిసరి చేసింది. అన్ని దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేసింది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
మ్యూటేషన్లు, ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరణ, నల్లా కనెక్షన్, ప్రకటనలు, ఆస్తి పన్నుల గణన, ఖాళీ స్థలంపై పన్నుల గణన, భవన నిర్మాణ అనుమతులు తదితర సేవల కోసం ఆన్‌లైన్‌లో మాత్రమే దర ఖాస్తులు స్వీకరించాలని పురపాలక శాఖ ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని మునిసిపాలిటీల్లో ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గా కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని తేలడంతో పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది.
మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించలేదని, ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొంటూ ప్రతి నెలా చివరిలో నివేదికలు సమర్పించాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. కొన్ని మునిసిపాలిటీలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణను ఇంకా ప్రారంభించలేదు.