శ్రీ‌మంతులు కాదు.. 'సిరి'మతులే! | only money peoples not a Srimantulu! | Sakshi
Sakshi News home page

శ్రీ‌మంతులు కాదు.. 'సిరి'మతులే!

Published Sun, Jul 10 2016 4:53 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

శ్రీ‌మంతులు కాదు.. 'సిరి'మతులే! - Sakshi

శ్రీ‌మంతులు కాదు.. 'సిరి'మతులే!

‘ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఊరిని అభివృద్ధి చెయ్.. లేదంటే ‘లావై’పోతావ్..’... గ్రామాల దత్తత కథాంశంతో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో కథానాయకుడి డైలాగ్ ఇది. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామాలను దత్తత తీసుకుని, అభివృద్ధి చేస్తామని హామీలు కురిపించారు. పోటీలు పడి మరీ గ్రామాల్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటనలు చేశారు. మాటల్లోనే కోట్లు కుమ్మరించారు. కానీ ఆ హామీలు నిలబెట్టుకోకుండా, అసలు పట్టించుకోకుండా ‘లావై’పోతున్నారు. అంతా సిరిమతులే (డబ్బు మనుషులే) అని నిరూపించుకుంటున్నారు.

తమ సమస్యలు తీరుతాయన్న ఆశతో ఉన్న ప్రజలకు నిరాశ మిగుల్చుతున్నారు. మన ఊరిని మనమే అభివృద్ధి చేసుకుందామనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ‘గ్రామజ్యోతి’ పథకాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘మన ఊరు-మన ప్రణాళిక’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఊరూరూ తిరగాలని, అంతా కలసి ఊరికి ఏం కావాలో గుర్తించి, సమకూర్చాలనేది లక్ష్యం. ఈ క్రమంలోనే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, జడ్పీ చైర్‌పర్సన్లు, ఇతర ప్రముఖులు పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత వాటి ఊసే మర్చిపోయారు. కొన్ని చోట్ల మాత్రమే పరిస్థితి కొంత మెరుగ్గా కనిపిస్తోంది. ఈ అంశంపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనే ఈ వారం ఫోకస్..     - సాక్షి నెట్‌వర్క్

 
ఆర్భాటంగా దత్తత ప్రకటనలు  ఆనక మరిచిపోయిన మంత్రులు, ప్రజాప్రతినిధులు
అన్నీ ఉత్తుత్తి హామీలే.. పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితం
సమస్యలతో సతమతమవుతున్న గ్రామాలు
రెండు మూడు చోట్ల మాత్రం పరిస్థితి కొంత మెరుగు
అటకెక్కిన ‘మన ఊరు-మన ప్రణాళిక’

 
‘మంత్రించని' అభివృద్ధి
మంత్రుల దత్తత గ్రామాల్లో అభివృద్ధి, ప్రగతి పనుల తీరు తీసికట్టుగా ఉంది. దత్తత తీసుకున్నట్టు మంత్రులు ఘనంగా ప్రకటనలు చేసినా... తరువాత నిధుల మంజూరు, పర్యవేక్షణ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకున్న దాఖలాల్లేవు. ఇతర గ్రామాల తరహాలోనే ఈ దత్తత గ్రామాలు కూడా పలు సమస్యలతో సతమతం అవుతున్నాయి. పరిష్కరించదగ్గ చిన్న చిన్న సమస్యలూ తిష్టవేశాయి. దాదాపు అన్నిచోట్లా ఒకట్రెండు పనులకు శ్రీకారం చుట్టి వదిలేశారు. వాటి ప్రగతిని మళ్లీ సమీక్షించిన దాఖలాలు లేవు.

నల్లగొండ జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామాన్ని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, రక్షిత నీరు వంటి సమస్యలతో ఈ గ్రామం ఇప్పటికీ ఉక్కిరిబిక్కిరవుతోంది. హైస్కూల్‌ను డిజిటలైజేషన్ చేస్తాననే హామీ నెరవేరలేదు. ఈ గ్రామంలో 268 కుటుంబాలకు నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. అక్కడక్కడా చెత్తకుండీల ఏర్పాటు ఒక్కటే కొత్తగా కనిపిస్తున్న దృశ్యం.
నల్లగొండ జిల్లా కొలనుపాక గ్రామంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటర్ ట్యాంక్
 
మంత్రుల దత్తత గ్రామాల్లో దుస్థితి
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న (ఆదిలాబాద్ జిల్లా) బేల మండలంలోని బెదోడ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడ ఏళ్ల క్రితం వేసిన సీసీ రోడ్లు కంకర తేలి వెక్కిరిస్తున్నాయి. గ్రామంలో విద్యాబోధన కుంటుపడింది.
 
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామం దేవాదాయ, న్యాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వస్థలం. దీంతోపాటు ఆలూరు, పొన్కల్, మల్లాపూర్, గుండంపల్లి గ్రామాలనూ ఆయన దత్తత తీసుకున్నారు. ఎల్లపెల్లి కాస్త మెరుగ్గా ఉన్నా గృహ నిర్మాణ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వగ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి పునాది పడలేదు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది.
 
మంత్రి జగదీశ్‌రెడ్డి (నల్లగొండ జిల్లా) ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరు, సూర్యాపేట మండలం పిల్లలమర్రి, చివ్వెంల గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఏపూరు ఇంతైనా రూపు మారలేదు. వర్షం వస్తే ఊరు-మురుగు ఏకం కావాల్సిందే. ప్రత్యేక నిధులు రూ.5 లక్షలతో సీసీరోడ్లు నిర్మిం చారు. రూ.50 లక్షలతో 420 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టగా 80 శాతం పూర్తయ్యాయి. పిల్లలమర్రిలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం 50 శాతమే పూర్తయింది. చివ్వెంలలో రోడ్ల నిర్మాణం జరిగినా గూడాలలో తాగునీటి సమస్య నెలకొంది. ముఖ్యంగా బస్సు సౌకర్యం లేక విద్యార్థులు 2 కిలోమీటర్లు నడిచి మండల కేంద్రంలోని పాఠశాలలకు వెళ్తున్నారు.
 
వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గిరిజన మంత్రి చందూలాల్ స్వగ్రామం. ఆ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని ఏడాదవుతున్నా మచ్చుకైనా ఏ చిన్న పనీ కాలేదు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్డు సమస్యలది దత్తతకు ముందు నాటి పరిస్థితే. ఆశ్రమ పాఠశాల భవనానికి రూ.95 లక్షలు, బాలికల కళాశాల భవనానికి రూ.3.45 కోట్ల కేటాయింపు ఒకింత ఊరట. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైనా పనులు మొదలుకాలేదు. ఇక మండల కేంద్రం వెంకటాపురం కూడా ఆయన దత్తత గ్రామమే. కుగ్రామం కంటే దారుణంగా ఉన్న పరిస్థితులతో ఇక్కడి పది వేల మంది జనాభా ఇక్కట్లు పడుతున్నారు. ఏడాదిగా మంత్రి రూపాయి కూడా మంజూరు చేయించలేదని గ్రామస్తులు అంటున్నారు.
 
* ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్(కరీంనగర్ జిల్లా) చెల్పూ ర్, సిరిసేడు, వీణవంక, కమలాపూర్ గ్రామాలను దత్తత తీ సుకుంటున్నట్టు ప్రకటించారు. దసరా తరువాత రూపురేఖలే మార్చేస్తానన్నారు. కానీ రెండేళ్లుగా వీసమెత్తు పని జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెల్పూర్ అభివృద్ధికి రూ.20 కోట్ల మేరకు తీర్మానాలు చేసి సరిపెట్టారు.
 
* భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం మాటిండ్ల(మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం )లో అభివృద్ధి పనులకు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. రూ.67లక్షలతో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి.
 
* రంగారెడ్డి జిల్లా ముద్దాయిపేట, కొండాపూర్, నీళ్లపల్లి.. ఈ మూడూ రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి దత్తత గ్రామాలు. సమస్యల్లో ఇవి ఇతర గ్రామాలతో పోటీపడుతున్నాయి.
 
* సోమేశ్వర్, పోచారం, బీర్కూర్, బీర్కూర్ తండా, రుద్రూర్, కోటగిరి, సోంపూర్..  వ్యవసాయ మంత్రి పోచా రం శ్రీనివాసరెడ్డి(నిజామాబాద్ జిల్లా) దత్తత తీసుకున్న ఈ గ్రామాల్లో రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. సోమేశ్వర్‌లో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.
 
* మంత్రి లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్ జిల్లా) దత్తత తీసుకున్న జడ్చర్ల మండలం కోడ్గల్‌లో అంతంతగానే అభివృద్ధి కనిపిస్తోంది. సమస్యల్ని ఇంకా గుర్తించే పనిలోనే ఉన్నామని ఆయన చెబుతున్నారు.
 
అధికారుల ‘ఊళ్ల’లో అంతో ఇంతో..!
* ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామాన్ని అధ్వానమైన రోడ్లు, మురుగు సమస్య పీడించేవి. జిల్లా కలెక్టర్ ఎం.జగన్‌మోహన్ దత్తత తీసుకున్నాక గ్రామం రూపురేఖలు కొంత మారాయి. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది.
* మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ దత్తత తీసుకున్న నవాబుపేట (హత్నూర మండలం)లో సీసీ రోడ్ల రూపు మారాల్సి ఉంది. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తయింది. ఇంటింటికీ ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈయనే దత్తత తీసుకున్న రాణాపూర్ (మనూరు మండలం)కు ఏడాదిలోనే రూ.1.25 కోట్లు మంజూరయ్యాయి. ఇక షాదుల్లానగర్‌ను ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ సుమతి దత్తత తీసుకున్నా అభివృద్ధేమీ చేయలేదు.
* ఖమ్మం జిల్లాలో మండల కేంద్రమైన వెంకటాపురాన్ని జెడ్పీ సీఈవో దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా.. ఇప్పటికీ ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. 2,000 మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడితే వంద మాత్రమే పూర్తయ్యాయి.
 
ప్రకటనలు ఆర్భాటం.. పనులు శూన్యం
* మహబూబ్‌నగర్ జిల్లాలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గన్యాగుల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ఊరిలో అడుగుపెట్టలేదు. ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. వివిధ పనులకు నిధుల కేటాయింపే తప్ప.. పనులు జరుగుతున్న జాడలేదు. గ్రామస్తులు కూడా ఆయా సమస్యల పరిష్కారంపై ఆశ వదులుకున్నారు.

* మెదక్ జిల్లాలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దత్తత తీసుకున్న కల్హేర్ మండలం సిర్గాపూర్, ఝరాసంగం మండలం ఈదులపల్లి గ్రామాల్లో మచ్చుకైనా అభివృద్ధి జాడలేదు. దత్తత తీసుకున్న రోజున హడావుడి చేసిన ఎంపీ.. ఆపై మరిచేపోయారని గ్రామస్తులు అంటున్నారు. బీబీ పాటిల్ దత్తత తీసుకున్న మరో గ్రామం నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్‌దీ అదే పరిస్థితి. గాంధారిలో మాత్రం సీసీ రోడ్లు వేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దత్తత తీసుకున్న పన్యాల, అహ్మద్‌నగర్, కోనాపూర్ గ్రామాల్లో మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు నత్తనడక నడుస్తున్నాయి.

* ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ వల్లాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని అనేక తీర్మానాలు చేసినా.. కార్యాచరణ కొరవడింది. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దత్తత గ్రామంలో హామీలన్నీ నీటి మూటలయ్యాయి. డబుల్ బెడ్‌రూం ఇళ్లు 20 కట్టిస్తామని ప్రకటించినా.. లబ్ధిదారుల ఎంపికే జరగలేదు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తన ఐదు దత్తత గ్రామాలకు అభివృద్ధి రూపేణా పైసా కూడా ఇవ్వలేదు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన దత్తత గ్రామమైన దంతలబోరులో ఇటీవలే సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. గ్రామానికి బస్సు సర్వీసు ఏర్పాటు, పైప్‌లైన్ నిర్మాణం వంటి రెండు పనులే జరిగాయి. ప్రధాన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.

* నిజామాబాద్ జిల్లాలో ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తత గ్రామాలైన కందకుర్తిలో రూ.1.10 కోట్లతో, మాణిక్‌భండార్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బాల్కొండ ఎమ్మెల్యే దత్తత గ్రామాలైన వడ్యాట్, చౌట్‌పల్లి, కొత్తపల్లి, పడగల్, బడాభీమ్‌గల్‌లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. బోధన్ ఎమ్మెల్యే దత్తత గ్రామాల్లో అభివృద్ధి కానరావడం లేదు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దత్తత జాబితాలోని ఇందల్వాయి, సిరికొండ, తొర్లికొండ, ధర్పల్లి, మంచిప్ప గ్రామాల్లో... ఎమ్మెల్సీ వీజీగౌడ్ దత్తత గ్రామమైన రాంపూర్‌లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు మాత్రమే తయారయ్యాయి. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

ఆయన స్వగ్రామం బస్వాపూర్‌లో పనులు ఫర్వాలేదనిపిస్తున్నా.. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు నెలకొన్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దత్తత గ్రామాలైన మామిడిపల్లి, వెల్మల్, మాక్లూర్‌లకు ఇప్పటివరకు హామీలు మాత్రమే ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి పోచారం, తిమ్మారెడ్డి, ఎర్రపహాడ్, జువ్వాడి, ఉప్పల్‌వాయి గ్రామాల్ని దత్తత తీసుకుని సీసీ రోడ్లు వేయించారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే దత్తత గ్రామంలో చెప్పుకోదగిన అభివృద్ధేమీ జరగలేదు.

* కరీంనగర్ జిల్లాలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తన నియోజకవర్గంలోని ఏడు గ్రామాలను దత్తత తీసుకున్నా.. ఒక్కోసారి పర్యటించడం మినహా చేసిందేమీ లేదు. వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు దత్తత తీసుకున్న తిప్పాపూర్, రుద్రంగి, మామిడిపల్లి, తుర్తి, కట్లకుంట గ్రామాల్లో ఒక్క మామిడిపల్లిలో రూ.43 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి పరిస్థితి అధ్వానంగా ఉంది.

* రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి హాజీపూర్‌ను దత్తత గ్రామంగా ప్రకటించి చాలా హామీలిచ్చినా.. ఇప్పటి వరకు బీటీ రోడ్డు మాత్రం వేయించగలిగారు.
 
జెడ్పీ చైర్‌పర్సన్ల ఇలాకాల్లో..
* ఆదిలాబాద్ చైర్‌పర్సన్ వి.శోభారాణి సొంత గ్రామమైన కడ్తాల్(నిర్మల్ మండలం)లో రోడ్డు పనులు చేయిస్తున్నా.. ఇక్కడి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు కిచెన్ షెడ్లు కరువయ్యాయి.
* మెదక్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి దత్తత గ్రామం నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో అభివృద్ధి పనులన్నీ ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.
* రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి దత్తత గ్రామం తిమ్మాయిపల్లిలో మహిళల ఉపాధికి బాటలు వేయగలిగారు.
 
మంత్రి దత్తత తీసుకున్నా అంతంతే..
‘‘మంత్రి జగదీశ్‌రెడ్డి ఏపూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. నీళ్ల కోసం మహిళలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాభివృద్ధిపై మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలి.’’    
- నజీర్, ఏపూరు, నల్లగొండ జిల్లా
 
అంతా ఆర్భాటమే..
‘‘సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు ఏమేం కావాలో ఆరా తీశారు. అంతే ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. ‘మన ఊరు-మన ప్రణాళిక’కు బూజు పట్టింది.’’
- మహ్మద్ రఫీఖాన్, కరీంనగర్ జిల్లా సిరిసేడు మాజీ సర్పంచ్
 
నియోజకవ ర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తా
‘‘నాకంటూ దత్తత గ్రామాలేవీ లేవు. నియోజకవర్గాన్ని సమదృష్టితో అభివృద్ధి చేస్తా. గిరిజన సబ్‌ప్లాన్, ఇతర శాఖల నిధుల మంజూరుకు కృషి చేస్తా. పదవీ కాలం ముగిసేలోపు నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం.’’
- మంత్రి చందూలాల్
 
అభివృద్ధి వేగవంతం చేస్తాం
‘‘నిర్మల్ నియోజకవర్గంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తా. ఇప్పటికే మరుగుదొడ్లు, మురికి కాలువలు, సీసీరోడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఎల్లపెల్లిలో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేస్తాం.’’
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
 
దత్తత గ్రామాలపై ప్రత్యేక దృష్టి
‘‘జిల్లాలోని దత్తత గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. బాన్సువాడ నియోజకవర్గానికి గ్రామజ్యోతి కింద రూ.240 కోట్లు కేటాయించాం. వీటితో అభివృద్ధి పనులు చేపడతాం.’’
- మంత్రి పోచారం
 
అభివృద్ధికి చర్యలు చేపట్టాం
‘‘దత్తత గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తా. ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేశాను.’’
- మంత్రి లక్ష్మారెడ్డి
 
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
‘‘నా దత్తత గ్రామం ఎగ్లాస్‌పూర్‌తో పాటు ఇతర గ్రామాల సమగ్రాభివృద్ధే నా ధ్యేయం. అభివృద్ధి పనులకు రూ.75 లక్షలు మంజూరు చేయించా.’’     
- సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ చైర్మన్
 
ఐదు గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ
‘‘వేములవాడ నియోజకవర్గంలో ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. వాటిలో ప్రగతి పనులు వేగవంతం చేసేందుకు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా..’’
- ఎమ్మెల్యే రమేశ్‌బాబు
 
‘శ్రీమంత’ పల్లెలు
* సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో
* రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రా మాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటున్న ఆయన.. కోట్ల రూపాయలను కేటాయించారు. రెండు పల్లెల్లో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.28.62 కోట్లతో ఎర్రవల్లిలో 330, నర్సన్నపేటలో 200 డబుల్ బెడ్‌రూం ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి.

రెండు గ్రామాల్లోని 42 మంది నిరుద్యోగులకు రూ.3.62 కోట్లతో వంద శాతం సబ్సిడీతో 42 ట్రాక్టర్లను అందజేశారు. రూ.1.50 కోట్లతో ఫంక్షన్‌హాల్, రూ.1.20 కోట్లతో గోదాం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ.2కోట్లతో ఇంటింటికీ సోలార్ విద్యుత్ సిస్టమ్ అమర్చుతున్నారు. కూడవెల్లి వాగు పునరుద్ధరణకు రూ.28.80 కోట్లు మంజూరయ్యాయి. రూ.8 కోట్లతో పాండురంగ రిజర్వాయర్ పనులు, రూ.16.90 కోట్లతో వివిధ కుంటల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 2,800 ఎకరాల్లో బిందు సేద్యానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement