సంతాపం.. ఉద్రిక్తం
ఆగ్రహించిన ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు
డీఎంఈ, ప్రిన్సిపాల్ నిర్బంధం
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన వైద్య విద్యార్థుల సంతాప సభ ఉద్రిక్తంగా మారింది. ఉద్వేగానికి లోనైన విద్యార్థులు ఉస్మానియా వైద్య కళాశాల డీఎంఈ, ప్రిన్సిపాల్‌ను నిర్బంధించారు. మీ నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన గిరిలక్ష్మణ్, ఉదయ్, విజయ్‌తేజ, ప్రణయ్‌రాజారామ్‌కు నివాళులర్పిస్తూ శనివారం ఉస్మానియా వైద్య కళాశాలలో సంతాప సభ ఏర్పాటు చేశారు. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రమణి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్, అలుమిని అధ్యక్షుడు గోపాలకృష్ణ, మాజీ డీఎంఈ పి.శ్రీనివాస్, నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజిరెడ్డితో పాటు మృతుడు ప్రణయ్‌రాజారామ్ తల్లిదండ్రులు శ్రీనివాస్‌మూర్తి, నిర్మల హాజరయ్యారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.
భగ్గుమన్న విద్యార్థులు...
ఈ సందర్భంగా డీఎంఈ రమణి మాట్లాడుతూ... చనిపోయిన విద్యార్థులు తన పిల్లలతో సమానమన్నారు. వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వచ్చేలా ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ఈ బడ్జెట్‌లో కళాశాల అభివృద్ధికి రూ.63 కోట్లు కేటాయించారని, వాటితో బస్సులు ఇతర అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రిన్సిపాల్ ప్రభాకర్ కూడా ఇదే తరహాలో ప్రసంగించడంతో విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వారితో పాటు మాజీ డీఎంఈ, అధ్యాపకులను ఆడిటోరియం తలుపులు మూసేసి నిర్బంధించారు. తోటి విద్యార్థులను ఎంతో మిస్సయ్యామని, శవాలపై రాజకీయం చేస్తున్నారే తప్ప వారి కుటుంబాల గురించి ఆలోచించడం లేదని కన్నీరు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ స్నేహితులను కోల్పోయామన్నారు. నాడు కోట్ల రూపాయలు కళాశాల అభివృద్ధికి ఖర్చు చేసినవారికి బస్సుల గురించి ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. తమ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పేవరకూ అధికారులెవరినీ బయటకి కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి వచ్చిన పోలీసులను సైతం విద్యార్థులు వెళ్లిపోవాలని కోరడంతో వారు బయట బందోబస్తుకే పరిమితమయ్యారు. దాదాపు ఐదు గంటలపాటు అధికారులను నిర్బంధించారు.
కేసీఆర్‌కు చికిత్స చేయాల్సిందీ వైద్యులే
ప్రణయ్ తల్లిదండ్రులు
నలుగురు వైద్య విద్యార్థులు చనిపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని మృతుడు ప్రణయ్ తల్లిదండ్రులు నిర్మల, శ్రీనివాస్‌మూర్తి ఆరోపించారు. రేపు ఆయనకేమన్నా అయితే వైద్యులే చికిత్సలందించాలన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం ఫొటోలకే ఫోజులిచ్చారని, కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదన్నారు. చిన్నచిన్న స్కూళ్లు కూడా మంచి బస్సులు పెట్టుకుంటుంటే దేశంలోనే ప్రతిష్టాత్మక కళాశాలకు బస్సు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము ఎక్స్‌గ్రేషియా కోసం రాలేదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలియజెప్పడానికే వచ్చామన్నారు.